మహిళా దినోత్సవం రోజు నాకు ఉత్తరమేంటని ఆశ్చర్య పోతున్నారా?
ఉదయం మేం మేల్కొనేది అమ్మ పిలుపుతోనే! స్కూలుకి సిద్ధం కావడానికి కావాల్సివన్నీ తనే అమర్చి పెట్టేస్తుంది. స్నానం చేసొచ్చేసరికి వేడి వేడిగా టిఫిన్ అందిస్తుంది. బాక్సు సర్ది సమయానికి స్కూలు చేరుకునేలా చూస్తుంది. రాత్రి మేం నిద్రపోయే వరకూ మా పక్కనే ఉంటుంది. మాతోపాటే నిద్ర పొమ్మంటే.. ‘ఇంకా పని ఉంద’ంటుంది. అమ్మకి నిద్రెలా సరిపోతుంది నాన్నా? పాపం ఒక్కోసారి తనకు తినడానికీ సమయముండదు. హడావుడిగా ఆఫీసుకు బయలుదేరుతుంది. మరి..
తనకు ఆకలేయదా? దాన్ని పట్టించుకోవాల్సిందెవరు?
ఆఫీసులో పగలంతా పని చేసి, సాయంత్రం రద్దీ బస్సుల్లో ఇంటికి చేరుతుంది. మనం ఇంటికొచ్చాక కాస్త సేదతీరతాం. అమ్మేమో రాగానే మా హోంవర్క్, రాత్రి భోజనమంటూ హడావుడి. ఆదివారాలొచ్చాయంటే మనకు ఉల్లాసం, విశ్రాంతి. అమ్మ చక్కగా నచ్చినవన్నీ వండిపెడుతుంది. మళ్లీ ఖాళీ దొరకదంటూ ఇల్లంతా సర్దుతుంది. అమ్మకి సెలవు లేదా? తనకు నచ్చిన వంట అంటూ ఏదీ చేసుకోదే? ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే దగ్గరుండి చూసుకుంటుంది కదా! తనకు బాలేకపోయినా ‘అబ్బే నాకేమైంది..
బానే ఉందంటూ’ పని అందుకుంటూనే ఉంటుంది. అమ్మకు నీరసం రాదా? మరి తనని చూసుకునేదెవరు?
అమ్మమ్మా, పిన్ని, మామయ్యలకు ఏవైనా ఆర్థిక సమస్యలు వస్తాయి. అమ్మకేమో సాయం చేయాలనుంటుంది. కానీ మాట మాత్రం ‘ఆయన్ని ఓసారి కనుక్కొని చెబుతా’ అనే! డబ్బు గురించి ఏ ప్రశ్న వచ్చినా ‘ఆయనే చూసుకుంటార’ంటుంది. వాళ్లను చూడటానికి వెళ్లాలనిపించినా నీ అనుమతి కోసం చూస్తుంది. మా స్కూలు పర్యటనలు, తన స్నేహితుల ఇంటికి వెళ్లాలన్నా నిర్ణయం నీదేనా? నచ్చిన దుస్తులు కొనుక్కోవాలన్నా మీ, నానమ్మ అభిప్రాయాలకే ప్రాధాన్యమా. ఆ మాత్రం స్వేచ్ఛ లేదా తనకీ?
మీకు, మిగతా వాళ్లకు నచ్చినట్టుగానే ఎందుకు ఉండాలి?
మేం పుట్టినప్పుడు ఇబ్బంది అవుతోందని ఉద్యోగం మానేసింది అమ్మే కదా! తర్వాత నీకు ఆర్థికంగా తోడు నిలవడానికి మళ్లీ ఉద్యోగంలో చేరింది. నువ్వు ఎప్పుడు కోప్పడినా.. ‘ఏదో పని చిరాకులే’ అని తనే సమాధానపడుతుంది. ఇంట్లో పనీ తక్కువేమీ కాదు కదా! పైగా తనకు ఆఫీసు పనీ తోడవుతోంది. మరి.. అమ్మకు చిరాకేయదా? మా పుట్టిన రోజంటే మాకు చాలా ఇష్టం. మమ్మల్ని తయారు చేయడం దగ్గర్నుంచి వంట వరకు మొత్తం అమ్మే. మనమంతా అతిథులతో గడుపుతోంటే.. తనేమో వాళ్లకు అన్నీ అందిస్తుంటుంది. ఏ చిన్న తేడా వచ్చినా అందరి వేళ్లూ తన వైపే! ఏ రోజైనా చివరి భోజనం తనదే!
మరి అమ్మెప్పుడు నాన్నా మనతో ఉల్లాసంగా గడిపేది?
తన ప్రతి పనిలో మనపై ప్రేమ కనిపిస్తుంది. మరి అంత ప్రేమ మనం చూపిస్తున్నామా నాన్నా? ఇక నుంచైనా మన పనులు మనమే చేసుకుందాం. తన పనులూ పంచుకుందాం. కొన్నిరోజులు ఇబ్బంది పడతామేమో! ఫర్లేదు అలవాటు చేసుకుందాం. ఇంటికి రాగానే అమ్మకి కాస్త విశ్రాంతిని ఇద్దాం. కొన్ని పనులు అందుకుందాం. ఇంటి పని ఆడవాళ్లదే అని ఎవరు చెప్పారు నాన్నా? మేమేదైనా తప్పు చేస్తే.. అదంతా అమ్మ పొరబాటే, లోపమే అనొద్దు. రెండు చేతులూ కలిస్తేనే కదా నాన్నా చప్పట్లు! పెంపకంలో మీ పాత్రా ఉంటుంది కదా! తన దుస్తులు, వ్యాపకాలు, ఆర్థిక నిర్ణయాలు తననే తీసుకోనీ. తన ఖాతా ఖాళీ చేసి, చిన్న అవసరాలకూ చేయిచాచేలా చేయడం ఎందుకు? సొంతంగా మదుపు చేసుకోనీ, పెట్టుబడులు పెట్టుకోనీ. తప్పటడుగు పడిందా? మళ్లీ ప్రయత్నించేలా ప్రోత్సహిద్దాం. తను తిందో లేదో కనిపెట్టుకొని ఉందాం. తన ఆరోగ్య బాధ్యతా మనదే. రోజూ అమ్మది అరకొర నిద్రే. సెలవుల్లో అయినా విశ్రాంతినిద్దాం. ఆలస్యంగా నిద్రలేవడం ఆడలక్షణం కాదని ఎవరు నాన్నా అన్నారు? మనం లేస్తే లేని తప్పు అమ్మ విషయంలో ఎలాగవుతుంది?
ఈ ఇంటికి ఆధారమే అమ్మ కదా! తనను కాపాడుకోవాల్సింది మనమే.
మమ్మల్ని యువరాణి, ముద్దుల తల్లి అంటూ గారాబం చేస్తావు కదా నాన్నా! మేం యువరాణులమైతే అమ్మ మహారాణి కదా! మేం నేర్చుకునేది అమ్మని చూసే! భవిష్యత్‌లో మాతో కూడా ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తే తట్టుకోగలవా నాన్నా? అమ్మా.. తాతయ్యకి యువరాణే కదా! మనమూ అలాగే చూద్దాం. కనీసం ఈ మహిళా దినోత్సవం నుంచైనా తనను ‘అమ్మ’తనానికే పరిమితం చేయక ఓ మనిషిగా చూద్దాం... ఓ మహిళగా చూద్దాం. ఈ మార్పును మనింటి నుంచే మొదలెడదాం. ఏమంటారు?
- మీ కూతుళ్లు