గ్రేటర్ హైదరాబాద్ నాలాలంటేనే ప్రజలు జంకుతున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కాలనీలు, బస్తీల నివాసాల మధ్యనే నాలాలున్నాయి. ఇందులో చాలావరకు తెరిచి ఉన్న నాలాలే ఎక్కువ. వర్షాకాలం వచ్చిందంటే నాలాలు ఉన్న ప్రాంతాల్లోని జనాలకు నరక యాతనే. నోరు తెరిచిన నాలాలతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అమాయకుల ఉసురు తీస్తున్నాయి. ప్రతి ఏటా నాలాల వల్ల పలువురు చనిపోవడం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నేరెడ్‌మెట్‌లోని దీనదయాళ్ నరగ్‌లో సరదాగా సైకిల్‌పై బయటకు వెళ్లిన చిన్నారి సుమేధ ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందింది. దీంతో మరోసారి నగరంలో నాలాల అంశం తెరపైకి వచ్చింది. ఇదే ప్రాంతంలో గతంలోనూ ఓ మహిళ నాలాలో పడి మరణించారు.
చలనం రాదా?
గతేడాది పాతబస్తీ, ఎల్‌బీ నగర్‌లోనూ ఇదే తరహా సంఘటనలు జరిగాయి. గ్రేటర్‌లో రోడ్డుకు సమాంతరంగా నాలాలు ఉండడం వల్ల వరద ముంచెత్తినప్పుడు ఓపెన్ నాలాలు కనపడక.. అందులో పడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నాలాలకు పైకప్పులు, ప్రహరీల నిర్మాణం చేపట్టేందుకు ప్రతి ఏటా కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తున్నామని బల్దియా చెప్తోంది. కానీ... క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితిలో మార్పు లేదు. ఉప్పుగూడ అరుంధతి కాలనీలో ఐదేళ్ల క్రితం నల్లవాగు నాలాలో బంతి కోసం దిగిన బాలుడు మృత్యువాత పడ్డాడు. పూల్‌బాగ్ వద్ద ఇదే నల్లవాగు నాలాను ఆనుకుని ఉన్న ఇల్లు కూలి.. నలుగురు దుర్మరణం పాలయ్యారు. 2010లో తలాబ్‌కట్ట నాలాలో బాలుడు పడి మరణించగా, చిలకలగూడ నాలాలో పడి ఇద్దరు మృతి చెందారు. కవాడిగూడ ప్రాగా టూల్స్ వద్ద ఉన్న నాలాలో పడి కొట్టుకుపోయి ఓ వ్యక్తి మరణించాడు. ఇలా నాలాలు ఎందరి ప్రాణాలు తీసినా అధికార యంత్రాంగంలో మాత్రం చలనం రావడం లేదు.
అధ్యయనం సరే.. ప్రగతి ఏది?
ప్రతి ఏటా వర్షాకాలం వస్తుందంటే గ్రేటర్‌లో నాలాలపై చర్చ మొదలవుతుంది. ఆక్రమణలు తొలగిస్తామని, విస్తరణ పనులు చేపడుతామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్తుంటారు. కానీ ఏళ్లు గడుస్తోన్నా నాలాల పరిస్థితి మాత్రం మారడం లేదు. విస్తరణ సంగతేమో గానీ.. కాలగమనంలో నాలాలు మరింత కుచించుకుపోతున్నాయి. పలు ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ నిర్మించినా సమస్యకు పూర్తి పరిష్కారం లభించలేదు. 2017లో నగరంలో భారీగా వర్షాలు కురిసినప్పుడు రాత్రి సమయంలో స్వయంగా మంత్రులే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. అప్పటికే పూర్తయిన సర్వేల నివేదికలు ఉన్నా.. మళ్లీ అధ్యయనం చేయించారు. డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీయించి.. రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల వద్ద ఉన్న వివరాల ఆధారంగా నాలాల వాస్తవ విస్తీర్ణం, ఆక్రమణల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏడేనిమిది నెలలు పట్టింది.
రోడ్డుకు.. నాలాకు తేడాలేదు!
ఎట్టకేలకు 12,182 ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. వీటిని తొలగించడానికి రూ.10వేల కోట్లు కావాల్సి ఉండగా.. మొదటి విడతలో 230 కోట్లతో 16.6 కిలోమీటర్ల మేర ఉన్న 842 ఆక్రమణలు తొలగింపునకు శ్రీకారం చుట్టారు. ఈ పనులకు 47 స్ర్టెచ్‌లుగా టెండర్ నోటిఫికేషన్ ప్రకటించగా... 46 ప్రాంతాల్లో పనుల అప్పగింత పూర్తయింది. ఇందులో 26 ప్రాంతాల్లో మాత్రమే పనులు ప్రారంభం కాగా.. మూడేళ్లలో 15 ప్రాంతాల్లో 6 కిలోమీటర్లలోపే విస్తరణ.. రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. మరోవైపు ఆస్తుల సేకరణ జరగకపోవడం వల్ల స్థలం అప్పగించలేదన్న కారణం చూపుతూ పలువురు కాంట్రాక్టర్లు టెండర్ రద్దు చేసుకున్నారు. ఇక పూర్తిస్థాయిలో నాలాల విస్తరణ ఎప్పటికవుతుందో అధికారులకే తెలియాలి. గ్రేటర్‌లో 390 కిలోమీటర్ల మేర ప్రధాన నాలాలు ఉండగా.. చాలా ప్రాంతాల్లో వాటికి పై కప్పులు లేవు. దీంతో భారీ వర్షం పడితే వరద నీరు చేరి రహదారికి, నాలాకు తేడా తెలియడం లేదు. ఈ క్రమంలోనే నాలాల్లో పడి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. నగరంలో ఎక్కడెక్కడ నాలాలున్నాయో గుర్తించి జియో ట్యాగింగ్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని చూస్తున్న ప్రాజెక్టు సైతం నత్తనడకనే సాగుతోంది.
లెక్కలేనన్ని నాలాలు..
నగరంలో పలు చోట్ల ప్రమాదకర నాలాలున్నాయి. మన్సూరాబాద్, సరూర్‌నగర్, కొత్తపేట, ఆర్‌కేపురం, హయత్‌నగర్ డివిజన్లలో ఓపెన్ నాలాలు ప్రమాదకరంగా ఉన్నాయి. మోతీనగర్ డివిజన్ బబ్బుగూడ, రామారావునగర్, స్నేహపురి కాలనీ, లక్ష్మీనగర్, గాయత్రినగర్‌లో ఉన్న ఓపెన్ నాలాల్లో తరచూ చిన్నపిల్లలు పడి గాయాల పాలవుతున్నారు. పలుమార్లు పశువులు కూడా నాలాల్లో పడిపోయాయి. ఉస్మాన్‌గంజ్ ఓపెన్‌నాలా గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ మీదుగా వెళ్లి ఇమ్లిబన్ వద్ద మూసీలో కలుస్తుంది. దీనికి ఇరువైపులా వేలాది కుటుంబాలున్నాయి. హుస్సేన్ సాగర్‌కు పెద్దయెత్తున వరదను తీసుకొచ్చే కూకట్‌పల్లి నాలాకు చాలాచోట్ల రక్షణ గోడ లేదు. సింగరేణి ఆఫీసర్స్ కాలనీ, సింగరేణి కాలనీ, మీటర్‌సీల్ ఆఫీస్ ప్రాంతాలలో నాలాలయితే.. దడ పుట్టిస్తున్నాయి. పటేల్‌కుంట చెరువు వద్ద ప్రారంభమై హెచ్‌ఎంటీనగర్ చెరువులో కలిసే నాచారం పెద్ద నాలాలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదు. వర్షం వచ్చిందంటే పలు ప్రాంతాల్లో భారీగా వరద నిలిచి పోతుంది. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల లెక్కల ప్రకారం నగరంలో నీరు నిలిచే ప్రదేశాలు 132 ఉన్నాయి. ఇందులో భారీగా నీరు నిలిచే పాయింట్లు 24 ఉన్నాయి. మైత్రివనం, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, చే నెంబర్, మెట్టుగూడ, , వీఎస్టీ, ముషీరాబాద్, బాలానగర్, మూసాపేట, బోరబండ, మియాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో నీరు వెళ్లేందుకు క్యాచ్‌పిట్, మ్యాన్‌హోల్ మూతలు తీస్తుంటారు. ఇది కూడా ప్రమాదాలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ, ప్రభుత్వం నాలాల విషయంలో సీరియస్‌గా తీసుకుని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.
ఇదీ చూడండి: సుమేధ ఘటనలో అధికారులపై కేసు నమోదు