ETV Bharat / city

Damaged Roads in AP : ఇదేందయ్యా ఇది.. ఇవసలు రోడ్లేనా..?

Damaged Roads in AP : రహదారులు అభివృద్ధికి పట్టుగొమ్మలు అంటారు.! అలాంటి రోడ్లు ఏపీలో పూర్తిగా పాడైపోయాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టులాంటి రహదారులు అధ్వానంగా మారాయి. ఎక్కడ చూసినా.. అడుగేస్తే మడుగే అనేంతలా పరిస్థితి ఉంది. అసలక్కడ రోడ్డు ఉందా అనిపించే దారులు లెక్కలేనన్ని..! రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై పాలకులు ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిశాయి. గతంలో రోడ్ల మరమ్మతులకు వర్షాలు అడ్డుగా ఉన్నాయని చెప్పుకొచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ వర్షాకాలం ముంగిట బాగుచేయడానికి ఆదేశాలిచ్చింది. ఇదంతా చూస్తే.. రోడ్డు కష్టాలు కొనసాగక తప్పవని ప్రజలు నైరాశ్యంలో మునిగిపోయారు. ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యపరంగానూ పల్లె జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్న పల్లె రహ'దారుణాల'పై పరిశీలనాత్మక కథనం.

Damaged Roads in AP
Damaged Roads in AP
author img

By

Published : May 9, 2022, 8:46 AM IST

Damaged Roads in AP : పల్లెసీమలంటే.. పచ్చని చెట్లు, చల్లని గాలులు, సందె వేళ గోధూళి.. అక్కడికి వెళ్లాలంటే నల్లని తాచుపాము లాంటి రోడ్లు... ఇవన్నీ ఒకప్పటి మాటలు. మరి ఇప్పుడో... పల్లెకు వెళ్లే రోడ్లపై అడుగడుగునా గుంతలు.. వాటిపై వెళ్తే విరిగే నడుములు... పట్టపగలు వెళ్లాలంటేనే చుక్కలు కనిపించే పరిస్థితులు... అసలు రోడ్డుందా అనే దుస్థితి... ఈ రోడ్లపై ఇక రాత్రిపూట గుడ్డిదీపాల వెలుగులో వెళ్లామంటే గమ్యస్థానం ఆసుపత్రే. ఇదీ ఏపీలోని గ్రామీణ రహదారుల పరిస్థితి. ఎటు చూసినా అడుగుకో గుంత పడి... రాళ్లు తేలి... అత్యంత ప్రమాదకరంగా మారిన ఆ దారుల్లో కొంతదూరం వెళ్తేనే ఒళ్లు హూనమవుతోంది. ఏ కాస్త ఆదమరిచినా గోతుల్లో పడి కాళ్ల్లు, చేతులు విరుగుతున్నాయి. ఇక గర్భిణులు ఆసుపత్రులకు వెళ్లాలంటే ఏ క్షణం ఏమవుతుందోనని భయపడాల్సిందే. నరకానికి నకళ్లులా మారిన ఈ పల్లెదారులను 25 జిల్లాల్లో ‘ఈనాడు-న్యూస్‌టుడే’ యంత్రాంగం ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు నిశితంగా పరిశీలించింది. మచ్చుకు జిల్లాకో రహదారి తీసుకుని చూస్తే.. వాటి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పరిశీలించిన 166 కిలోమీటర్లలోనే ఏకంగా 6,220 గుంతలు కనిపించాయి. వీటిలో దాదాపు వెయ్యి గుంతలైతే.. చాలా పెద్ద పెద్దవి! ఆరోగ్యపరంగానే కాదు.. ఆర్థికంగా కూడా పల్లె జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్న ఈ రహ‘దారుణాల’ పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలన కథనం.

పల్లెల్లోని రహదారుల్లో ప్రయాణం ప్రాణాల మీదకు వస్తోంది. కొన్నేళ్లుగా కనీస నిర్వహణ లేక, మరమ్మతులకు నోచక, గుంతలనైనా పూడ్చకపోవడంతో రోడ్లన్నీ అత్యంత ప్రమాదకరంగా, భయానకంగా మారాయి. వర్షం పడితే ఇక పరిస్థితి అగమ్యమే. ఈ రోడ్లమీద వెళ్లే ఆటోలు, ఇతర వాహనాలు.. అతి తక్కువ సమయంలోనే దెబ్బతింటుండటంతో... వాళ్లకు వచ్చే ఆదాయంలో ఎక్కువ మొత్తం మరమ్మతులకే పోతోంది. పల్లెల నుంచి వ్యవసాయ ఉత్పత్పుల్ని తరలించాలన్నా, సాగుకి అవసరమైన ఎరువులు వంటివి తెచ్చుకోవాలన్నా... ఈ అధ్వానపు రోడ్ల మూలంగా ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఒక పల్లె కాదు.. ఒక ఊరు కాదు.. ఎక్కడ చూసినా ఇదే దుస్థితి. ఉదాహరణకు అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్వగ్రామం సుద్దమల్లకు కూతవేటు దూరంలోని కల్పనాయుని చెరువు- మూలపల్లె గ్రామాల మధ్య రహదారి దారుణంగా మారినా పట్టించుకోవడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యాటక ప్రాంతం వంజంగికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా రహదారులకు నామమాత్రంగా ఇస్తూ, అధిక శాతం నిధుల్ని భవనాల నిర్మాణానికి కేటాయించడంతో ఇవి కనీస మరమ్మతులకు కూడా నోచుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లతో చేపట్టిన రహదారుల పనులూ గుత్తేదారులకు బిల్లులు చెల్లించక నిలిచిపోయాయి. వెరసి.. రాష్ట్రవ్యాప్తంగా పల్లె రోడ్లన్నీ ఇదే అధ్వాన స్థితికి చేరుకున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో నక్కపేట- పాలఖండ్యాం- జి.సిగడాం మధ్య 10 కి.మీ.ల రహదారిలో... నిద్దం నుంచి జి.సిగడాం వరకు బాగా దెబ్బతింది. దీంతో దూరం ఎక్కువైనా పొగిరి మీదుగా వెళ్తున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు నుంచి పాచిపెంట మండలం గురివినాయుడుపేట వరకు 9 కి.మీ.ల రోడ్డు అధ్వానం.

పశ్చిమగోదావరి జిల్లా గుమ్ములూరు- అప్పారావుపేట రహదారి పూర్తిగా పాడైంది. వ్యవసాయోత్పత్తుల్ని తరలించాలన్నా, చేపల మేత, ఎరువులు, ఇతర ఉత్పత్తులను పొలాలకు తీసుకెళ్లాలన్నా ఈ మార్గమే ప్రధాన ఆధారం.

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పాటూరు గ్రామం నుంచి వినాయక్‌ నగర్‌కు వెళ్లే 3.1 కి.మీ.ల రోడ్డు ప్రమాదకరంగా తయారైంది.

ప్రకాశం జిల్లా తాళ్లూరు- అద్దంకి రహదారి గోతులమయంగా మారింది. ఇటీవల కారు బోల్తాపడి పలువురికి గాయాలయ్యాయి.

నంద్యాల జిల్లా గడివేముల- వెలుగోడు రోడ్డులో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. రేగడ గూడూరు నుంచి వేల్పనూరు వరకు 2 కి.మీ. అధ్వానంగా తయారైంది. 2 కి.మీ. ప్రయాణానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతోంది.

శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి నుంచి ఆమిదాలకుంట వరకు 15 కి.మీ. రహదారి దెబ్బతింది. 15 గ్రామాల ప్రజలు దీనిపైనే ప్రయాణించాలి. అంబులెన్స్‌ వచ్చేందుకూ కుదరట్లేదు.

బాపట్ల జిల్లా గుడిపూడి- ఏట్రవారిపాలెం రహదారి అధ్వానంగా మారడంతో రైతులు, కూలీలు సైకిళ్లపై వెళ్లాలన్నా ఇబ్బంది పడుతున్నారు. చుట్టూ 10 కి.మీ. తిరిగి రావాల్సి వస్తోంది.

గుంతలు కాదు.. ప్రాణగండాలు

కృష్ణా జిల్లా అవనిగడ్డ- కోడూరు రహదారి ఘోరంగా ఉంది. ఆర్నెల్ల క్రితం అప్పటి సీఎస్‌ హంసలదీవి వద్ద సాగర సంగమం ప్రాంతానికి వచ్చారు. అధికారులు హడావుడిగా పొక్లెయిన్‌తో గుంతల్ని సరిచేసి, కంకర, క్వారీ డస్టు పోశారు. అరకొరగా చేసిన ఆ పనుల కారణంగా ఇప్పుడు మరింత దారుణంగా మారి, దుమ్ము విపరీతంగా పైకి లేస్తోంది. ఇటీవల గుంతల్లో వాహనం అదుపుతప్పి, వి.కొత్తపాలెం వాసి యలవర్తి శ్రీనివాసరావు మనవరాలు చనిపోయింది.

తూర్పుగోదావరి జిల్లాలో కాటవరం-కూనవరం మధ్య రోడ్డు దారుణంగా ఉంది. వాహనాలు తరచూ అదుపుతప్పుతున్నాయి. సూరయ్య అనే రైతు తన భార్యతో కలిసి పొలం నుంచి సైకిల్‌పై వస్తూ గోతుల్లో పడిపోయారు. ఆయన భార్య సీతమ్మకు తల పగిలి 6 కుట్లు పడ్డాయి.

ఎమ్మెల్యే ధర్మశ్రీ హామీలు నీటి మూటలే : అనకాపల్లి జిల్లాలోని చోడవరం నుంచి చాకిపల్లి వరకు ఉన్న రోడ్డు మొత్తం గోతులతో నిండిపోయింది. ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గత ఎన్నికల ముందు ఈ రోడ్డు మీదుగానే పాదయాత్ర చేశారు. రోడ్డు దుస్థితిపై అప్పటి తెదేపా ఎమ్మెల్యే మీద విమర్శలు గుప్పించారు. తనను గెలిపిస్తే బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఎమ్మెల్యే ఆ రోడ్డు వంక చూడలేదని, భారీ గుంతలున్నచోట, తామే అప్పుడప్పుడూ మట్టి పోసి పూడ్చుతున్నామని బంగారమ్మపాలెం, పీఎస్‌పేట వాసులు చెబుతున్నారు.

పర్యాటక ప్రాంతంపైనా అశ్రద్ధే : అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు నుంచి పర్యాటక కేంద్రమైన వంజంగి మేఘాల కొండకు నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. సీజన్‌లో వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అంత ప్రాధాన్యమున్న ఈ రహదారి గోతుల మయంగా మారింది. అడుగడుగునా రాళ్లు తేలి ప్రమాదకరంగా కనిపిస్తోంది. వర్షాలకు కొన్నిచోట్ల కోతకు గురైంది. వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇక్కడ బోల్తాపడటం ఖాయం.

పొలం దోవే దిక్కైంది..

"మొలగవల్లి- మద్దికెర రోడ్డు అత్యంత ఘోరంగా ఉంది. భార్యాపిల్లలతో బైక్‌పై వెళ్లాలంటే హడలిపోతున్నాం. వర్షాకాలంలో గుంతల్లో నీరు నిండి లోతు అంచనా వేయలేక నేనే 3 సార్లు కిందపడ్డా. ప్రస్తుతం ఆ రోడ్డుపై ఎవరూ వెళ్లడం లేదు. అంతా పక్కనే ఉన్న పొలాల్లో దోవ పెట్టుకుని మద్దికెరకు వెళుతున్నారు. పంటలు సాగు చేస్తే ఆ దోవలో వెళ్లలేం. అప్పుడీ నరకపు రోడ్డే దిక్కు."

- ఆదినారాయణ, మొలగవల్లి, కర్నూలు జిల్లా

-కె.సునీత, అద్దంకి, ప్రకాశం జిల్లా

రెండుసార్లు పడిపోయా : "ఉద్యోగం నిమిత్తం రోజూ అద్దంకి నుంచి తాళ్లూరు వెళ్లొస్తా. నేను దివ్యాంగురాలిని. రోడ్డుపై పెద్ద గోతులు ఉండటంతో ఎంత జాగ్రత్తగా నడిపినా రెండు సార్లు అదుపుతప్పి పడిపోయా. ఆ సమయంలో అటుగా వస్తున్నవారి సాయంతో బయటపడ్డా. మరో దారిలో వెళ్లాలంటే 10 కిలోమీటర్లు తిరిగి రావాలి. వేలమంది రాకపోకలు సాగించే ఈ రహదారిని బాగుచేస్తే అందరికీ ఉపయుక్తం."

-కె.సునీత, అద్దంకి, ప్రకాశం జిల్లా

అరకొర కేటాయింపులే.. : పంచాయతీరాజ్‌ రహదారులకు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపులు బాగా తగ్గిపోయాయి. పెట్రోల్‌, డీజిల్‌పై వసూలు చేస్తున్న సెస్సులో నుంచి పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి గతంలో రోడ్ల అభివృద్ధి నిధి (ఆర్డీఎఫ్‌) కింద ఏటా దాదాపు రూ.200 కోట్లు కేటాయించేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక పూర్తిగా నిలిపేశారు. రహదారుల నిర్వహణ, వాటి ఉన్నతీకరణకు సంబంధించిన పద్దుల కింద కేటాయించే నిధుల్లోనూ భారీగా కోత విధించారు.

....

మళ్లీ వానలొచ్చే ముందు హడావుడి : గత సీజన్‌లో వర్షాకాలం వచ్చేసిందని, ఇప్పుడు రోడ్లు బాగు చేయలేమని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. వర్షాలు తగ్గాక పనులు చేస్తామంది. తర్వాత పట్టించుకోలేదు. ఇటీవలే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించినప్పుడు... గ్రామీణ రహదారుల మరమ్మతులకు రూ.1000 కోట్లు అవసరమని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. టెండర్లు పిలిచి పాడైన రహదారుల్ని బాగు చేయాలని సీఎం ఆదేశించారు. ఎప్పుడు టెండర్లు పిలవాలి? ఎప్పుడు పనులు చేయాలి? నెల రోజులాగితే మళ్లీ వర్షాకాలం మొదలవుతుంది. అప్పుడు మళ్లీ వర్షాలు వచ్చేశాయని అధికారులు వాయిదా వేస్తారేమో తెలీదు.

నరేగా నిధుల్లో భవనాలకే ప్రాధాన్యం : వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లోని మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధుల్ని రహదారులకు ఇవ్వడం బాగా తగ్గించి ఎక్కువగా భవనాల నిర్మాణానికే కేటాయిస్తోంది. ఇప్పటివరకూ రూ.10,668 కోట్ల అంచనా వ్యయంతో 44,119 భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వాటిలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైద్య కేంద్రాలు, పాల శీతలీకరణ కేంద్రాలున్నాయి.
* ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజనలో (పీఎంజీఎస్‌వై) చేపట్టిన రహదారుల పనులకు రూ.210 కోట్ల వరకూ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీఎంజీఎస్‌వై కింద 500 నుంచి 600 కిలోమీటర్ల రహదారులు నిర్మిస్తున్నాయి. ఈ పనులకు రాష్ట్ర వాటా సమకూర్చకపోవడంతో బిల్లులు నిలిచిపోయాయి. పనులు చేసిన గుత్తేదారులు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని ఈ నెల 4న విజయవాడలోని పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

..

ఆర్టీసీ బస్సులూ నిలిపేశారు..! ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి నుంచి జానలగడ్డ వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసమైంది. ఫలితంగా ఈ మార్గంలో విస్సన్నపేట నుంచి జానలగడ్డ మీదుగా నడిచే ఆర్టీసీ బస్సును నిలిపేశారు. ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని ఆటోల్లో వెళుతున్నారు.
* కాకినాడ జిల్లాలో శంఖవరం-పెదమల్లాపురం రోడ్డు అధ్వానంగా ఉంది. 19.5 కి.మీ. రహదారి ఎక్కడ చూసినా రాళ్లు తేలి భయంకరంగా ఉంది. శంఖవరం నుంచి జి.కొత్తపల్లి, గౌరంపేటతోపాటు 19 గ్రామాలకు ఇదే ప్రధాన మార్గం. వైద్యానికి, ఇతర అవసరాలకు మండల కేంద్రానికి వెళ్లేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు ఆపేయడంతో ప్రజలు ఆటోల్ని ఆశ్రయిస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై నుంచి పడి తరచూ ఎవరో ఒకరు గాయపడుతున్నారు.

గోతిలోపడితే చేయి విరిగింది : "కొన్నేళ్ల నుంచి నక్కపేట- పాలఖండ్యాం- జి.సిగడాం రోడ్డు ఇలాగే ఉంది. ఎంతోమంది నాయకులు వస్తున్నారు, పోతున్నారు. రోడ్డు బాగుచేయాలని వేడుకున్నా ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈమధ్య బైక్‌పై వెళుతుండగా, గతుకుల్లో వాహనం అదుపుతప్పి గోతిలో పడిపోయాం. నా చేయి విరిగింది. వైద్యానికి సుమారు రూ.20వేలు ఖర్చయింది."

-కాంతమ్మ, పాలఖండ్యాం, శ్రీకాకుళం జిల్లా

బండితోపాటు పడిపోయా : "మాది లగిశపల్లి సమీప గ్రామం. ఓ స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నా. రోజూ ఈ దారిలోనే వెళ్తుంటా. మెట్టబంగ్ల నుంచి కిండంగి రింగ్‌రోడ్డు వరకు రహదారి అధ్వానంగా ఉంది. ఓసారి గోతుల్ని తప్పించబోయి స్కూటీతో పాటు కిందపడిపోయా. ఇలా చాలామంది గాయపడ్డారు. పర్యాటకంగా ఎంతో పేరుగాంచిన మేఘాల కొండకు తీసుకెళ్లే ఇలాంటి రోడ్డునూ బాగుచేయకుండా వదిలేశారు."

-బాలసరస్వతి, లగిశపల్లి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా

వైద్యానికి రూ.10 వేలు ఖర్చయింది : "కాటవరం- కూనవరం రహదారి అధ్వానంగా ఉంది. 3 నెలల క్రితం రాత్రిపూట బైక్‌పై నేను, నా స్నేహితుడు వెళుతూ గుంతలు కనిపించక కింద పడిపోయాం. నాకు పెదవులు చిట్లిపోయాయి. రెండు కుట్లు పడ్డాయి. చేతికీ దెబ్బతగిలింది. నా స్నేహితుడికి చెయ్యి విరిగింది. నాకు వైద్యానికి రూ.10 వేలు ఖర్చయింది. ఈ రోడ్డుపై ఇటీవల రెండు సార్లు ట్రాక్టర్‌ ప్రమాదాలు జరిగాయి."

-కాట్రగడ్డ సత్యనారాయణ, సీతానగరం, తూర్పుగోదావరి జిల్లా

ఆర్నెళ్లకోసారి కొత్త టైర్లు మారుస్తున్నాం " రోజూ వ్యవసాయ కూలీలను ఆటోలో పొలం తీసుకెళ్తుంటా. రోడ్డులో రాళ్లు పైకి లేచి ఉండటంతో టైర్లు పాడవుతున్నాయి. ప్రతి ఆరు నెలలకు టైర్లు కొత్తవి వేయాల్సి వచ్చి ఖర్చు పెరుగుతోంది. గోతులు ఎక్కువగా ఉండటంతో ఆటో దెబ్బతింటోంది. ఒళ్లు నొప్పులు వస్తున్నాయి."

-షేక్‌ రహీం, ఆటో డ్రైవర్‌, గుంటూరు జిల్లా

రోడ్డు లేదు.. రాళ్లే మిగిలాయి : "శంఖవరం - వేళంగి దారిలో 15 కి.మీ. పొడవునా రాళ్లే మిగిలాయి. టైర్లు పోతున్నాయి. ఎక్కడా తారు అన్నదే కనిపించదు. పెదమల్లాపురం నుంచి జీడిపిక్కల లోడు తీసుకెళ్లడానికి వచ్చా. చాలా రోడ్లలో తిరిగాను గానీ ఇలాంటి రహదారిని ఎక్కడా చూడలేదు."

- రాంబాబు, లారీ డ్రైవర్‌, కత్తిపూడి, కాకినాడ జిల్లా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.