సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం పనితీరు వల్ల నేరాలు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే మహిళలపై నేరాలు 18.6 శాతం, చిన్నారులపై 12.2శాతం తగ్గాయి. అన్ని రకాల నేరాల్లో 6.6శాతం తగ్గినట్లు సైబరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర గణాంకల నివేదిక పొందుపర్చారు. సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు మాత్రం గతేడాదితో పోలిస్తే... రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి. లాక్డౌన్ సమయంలో అంతర్జాలం ఎక్కువగా వినియోగించడం వల్ల చాలా మంది సైబర్ నేరాలబారిన పడ్డారు. ఉద్యోగాలు, సిమ్ స్వైప్ మోసాలు, కేవైసీ వంటి మోసాలకు పాల్పడ్డారు. 1119 సైబర్ కేసులు నమోదు కాగా.. 75 కేసులను ఛేదించి 136మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు నైజీరియన్లు, నలుగురు నేపాలీలున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన కేసుల్లోనూ సైబరాబాద్ పోలీసులు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. మా సంతోషి చిట్ ఫండ్... స్వధాత్రి ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, డిజిటల్ వే ట్రేడ్ వే స్కీం కేసుల్లో ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు.
ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు
రహదారి ప్రమాదాల నివారణ కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏటా దేశవ్యాప్తంగా రహదారి ప్రమాదాల్లో 1.5లక్షల మంది చనిపోతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12గంటల సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. 625 ప్రమాదాలు చోటు చేసుకోగా 663మంది మృతి చెందారు. జాతీయ రహదారుల పైనే 223మంది చనిపోయారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం... డ్రైవింగ్ లైసెన్సు లేని వాళ్లు వాహనాలు నడపడం.. వాహనాల డ్రైవింగ్‌లో నైపుణ్యం లేనివాళ్లు నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్లపై.. కేసులు నమోదు చేసి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 8 వేల 399 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు 2కోట్ల 10లక్షల జరిమానా వసూలు చేశారు. ఈ ఏడాది 47లక్షల 83వేల వాహనాలపై కేసులు నమోదు చేసి 178 కోట్ల జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసుల్లో 2వేల 387మంది డ్రైవింగ్ లైసెన్సులు, ప్రమాదాలు జరిగిన ఘటనల్లో 247 డ్రైవింగ్ లైసెన్సులు.. రవాణాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి రద్దు చేయించారు.
మరిన్ని చర్యలు
వచ్చే ఏడాదిలో రహదారి ప్రమాదాల నివారణ కోసం.. మరిన్ని చర్యలు చేపడతామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. సైబర్, ఆర్థిక నేరాలబారిన ప్రజలు పడకుడా సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టేలా... సైబరాబాద్ పోలీసులు ప్రణాళిక రూపొందించారు.
ఇదీ చదవండి: 'మూసీ పునరుజ్జీవం కోసం ప్రణాళికాబద్ధంగా పనులు'