CS Review on Rains: రాష్ట్రంలో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల చేపట్టాల్సిన జాగ్రత్తలు, అంటువ్యాదులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సహయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని సోమేశ్ కుమార్ సూచించారు. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలకు వరద అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. జీహెచ్ఎంసీ, జలమండలి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు.
అన్ని జిల్లాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని జలాశయాలు, చెరువులు పూర్తిగా నిండినందున గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను సీఎస్ అప్రమత్తం చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో చర్యలు చేపట్టామని తెలిపారు. రహదారులు, వంతెనలు తెగిన మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా వాహనాలు, ప్రయాణికులను నిలిపి వేయాలని.. ఆయా ప్రాంతాల్లో ప్రయాణించకుండా తగు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు, నీటిపారుదల, రోడ్లు భవనాలు, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖలన్నీ మరింత సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు.
"రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి. అన్ని శాఖల అధికారులు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలి. జలాశయాలు, చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాం. రోడ్లు, వంతెనలు తెగిన మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా చూడాలి." - సోమేశ్‌కుమార్, సీఎస్
ఇవీ చూడండి:
- బిగ్ అలెర్ట్.. రానున్న 3 రోజులు అతి భారీ వర్షాలు
- Heavy Rain in Hyderabad : అర్ధరాత్రి వచ్చింది.. ఆగం చేసింది..!