రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి విరివిగా రుణాలిచ్చి సహకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు మొత్తం 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటల సాగుకు వీలుగా అమలవుతున్న ఈ పథకానికి... యూనిట్‌కు రూ.1.20 లక్షలు లెక్కన రుణం ఇవ్వాలని సూచించారు. ఇవాళ జూమ్ యాప్ ద్వారా జరిగిన 28 వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల త్రైమాసిక సమావేశంలో.. వీధి వ్యాపారులకు రుణాలిచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడాన్ని బ్యాంకర్లను సోమేశ్ కుమార్ అభినందించారు.
కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని డిసెంబరు చివరి నాటికి 2.74 లక్షల మంది వీధి వ్యాపారులకు పది వేల లెక్కన రుణం ఇచ్చారని... దీనిని వంద శాతం అమలు చేయాలని కోరారు. ధరణి పోర్టల్ సమస్యలు త్వరలో సమసిపోతాయని... ఆస్తులకు చెందిన లావాదేవీల్లో యజమానుల పేర్లతో ఎదురయ్యే ఇబ్బందులు తొలిగిపోతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన గిరిజన పారిశ్రామికవేత్తల ప్రోత్సాహక కార్యక్రమం అమలుకు బ్యాంకర్లు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.