రైతు మెడకు చుట్టుకున్న అప్పుల ఉరిని తొలగించడానికి రాష్ట్ర సర్కార్ రైతు రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.లక్ష వరకు రుణాన్ని మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.25 వేలు, రూ.50 వేలు ఉన్నవారిలో కొందరికే మాఫీ జరిగింది. రుణమాఫీ అంశంపై రైతులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గుడ్‌న్యూస్ చెప్పారు. రూ.50వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ చేస్తామని ప్రకటించారు. వచ్చే ఆర్థిక ఏడాది రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది రూ.16,144 కోట్లను పంట రుణాల కోసం కేటాయించారు. రాష్ట్రంలో ఈ దఫాలో 5.12 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేయనున్నట్లు హరీశ్ రావు తెలిపారు.
వ్యవసాయానికి రూ.24వేల కోట్లు
వ్యవసాయ రంగానికి గత ఏడేళ్లుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తోంది. ఎనిమిది వ్యవసాయ సీజన్లలో రైతు బంధు పథకం కింద 50,448 కోట్ల రూపాయలను 63 లక్షల మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం జమచేసింది. రైతు భీమా పథకం ద్వారా రైతు మరణిస్తే వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. ఇప్పటి వరకు 75 వేల కుటుంబాలకు 3,775 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసినట్లు వెల్లడించారు. రైతుల అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసే తెలంగాణ సర్కార్ గతేడాది కంటే ఈ ఏడాది వ్యవసాయ రంగ బడ్జెట్‌ను తగ్గించింది. గతేడాది రూ.25వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ ఏడాది(2022-23)కి రూ.24,254 కోట్లు ప్రతిపాదించింది.
పామాయిల్ సాగుకు వెయ్యి కోట్లు..
రాష్ట్రంలో పామాయిల్ సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. పామాయిల్ సాగుకు ఈ పద్దులో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో 2.5 లక్షల ఎకరాల్లో అయిల్ పామ్ సాగుచేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోన్న రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదని స్పష్టం చేశారు.
అటవీ వర్సిటీకి రూ.100 కోట్లు
తెలంగాణలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు ఈ ఏడాది జనవరిలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు అటవీ వర్సిటీకి 2022-23 బడ్జెట్‌లో రూ.100 కోట్లు ప్రతిపాదించినట్లు హరీశ్ రావు తెలిపారు. యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు బీఎస్సీ(ఫారెస్ట్రీ) కోర్సు చదివిన వారికి అటవీశాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మరోవైపు మహిళా వర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
వైద్యకళాశాలలకు రూ.వెయ్యి కోట్లు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ సంవత్సరం కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలలను, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 2023 సంవత్సరంలోని రాష్ట్రంలోని మిగతా ఎనిమిది జిల్లాలైన మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 7 నూతన మెడికల్ కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్‌లో వెయ్యికోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.