ఈ ఏడాది మూడు సార్లు వరదలు వస్తే... ఒక్కసారైనా పరిహారం ఇచ్చారా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆగస్టు, సెప్టెంబరులో వచ్చిన వరదలకు 3.3 లక్షల ఎకరాల్లో పంటనష్టం వచ్చిందన్నారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 70 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. వరదల వేళ నష్టమెలా అంచనా వేస్తారని మంత్రి వ్యాఖ్యానించటం విడ్డూరంగా ఉందన్నారు. వరద బాధితులను పరామర్శించినందుకే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
గత 17 నెలల్లో 750 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న ఆయన... రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని అసమర్థ స్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందన్నారు. ధాన్యం బకాయిలు రూ. 2 వేల కోట్లు చెల్లించకుండా రైతులను వేధిస్తున్నారని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: తూర్పుగోదావరి జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన లోకేశ్