దీపావళి అంటేనే పటాకుల పండుగ. కాకరపువ్వొత్తుల నుంచి.. లక్ష్మీబాంబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వల వరకు ఎన్నో టపాసులు వీధుల్లో చేరి పండుగను మరింత ప్రకాశవంతంగా మార్చాల్సిందే. పటాకుల శబ్దాలతో గల్లీలన్ని మారుమోగాల్సిందే.. గగనంలో వెలుగులు విరజిమ్మాల్సిందే. మరీ.. వాటిని అమ్మే దుకాణాలు.. వారం రోజుల ముందు నుంచి మొదలుపెట్టి పండుగ రోజు కూడా సందడిగా మారాల్సిందే. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడంతా మారిపోయింది. టపాసుల దుకాణాలు వెలవెలబోతున్నాయి. అటు.. సరుకు అరకొరగానే ఉండి.. ఇటు కొనుగోలుదారులు అంతంతమాత్రంగానే ఉండటం వల్ల దుకాణాలు దిగాలుగా మారాయి.
అనుకున్నంత ఆర్డర్ రాకపోవటంతో..
దీపావళి కోసం... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోల్సేల్ వ్యాపారులు బాణాసంచా తయారీ పరిశ్రమలకు డిసెంబర్-జనవరిలోనే తమ ఆర్డర్ ఇస్తారు. దీపావళికి నెల రోజుల ముందు నుంచే ఈ దుకాణాల్లో సందడి నెలకొంటుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రీటైల్ వర్తకులు వచ్చి తమకు కావాల్సిన సరుకులు కోనుగోలు చేస్తు ఉంటారు. పండుగ రోజు వరకు ఇవి కళకళలాడుతూనే ఉంటాయి. కానీ ఈ సంవత్సరం ఈ పరిస్థితి లేదు. బాణాసంచా లేక దుకాణాలు వెలవెల పోతున్నాయి. తాము ఇచ్చిన అర్డర్ లో సగం కూడా రాలేదని హోల్సేల్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీటైల్ వర్తకులు పండుగకు వారం రోజుల ముందు నుంచి తాత్కలిక దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తారు. పండుగకు నెల రోజుల ముందే బాణాసంచా తెచ్చిపెట్టుకుంటారు. కానీ.. ఈసారి మాత్రం బాణాసంచా మూడు రోజుల ముందు కూడా అందని పరిస్థితి. అమ్మకాల కోసం దుకాణాలు ఏర్పాటు చేసినా.. సరుకు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి.
దుకాణాలకు దరఖాస్తులు తక్కువే..
గతం కంటే తక్కువ సంఖ్యలోనే దుకాణాల ఏర్పాటుకు లైసెన్స్ దరఖాస్తులు వచ్చాయని అగ్నిమాపక శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దుకాణాల్లో తనిఖీలకు వెళ్లినప్పుడు కూడా గతం మాదిరిగా సరుకు లేదని చెబుతున్నారు. మరి.. దీనంతటికీ కారణం.. కరోనా ఓ కారణమైతే.. అసలు కారణం శివకాశిలో ఉత్పత్తి అంతంతమాత్రంగానే ఉండటం.
పటాకుల సౌండ్లు తక్కువే..
బాణాసంచా లభ్యత తక్కువగా ఉండటం వల్ల దుకాణాల్లో టపాసుల రేట్లు కూడా పేలిపోతున్నాయి. అరకొరగా వస్తున్న కొనుగోలు దారులు కూడా.. ఆ రేట్లను చూసి బెంబేలెత్తిపోతున్నారు. అనుకున్న స్థాయిలో కొనలేక.. ఉన్నంతలో కొని సర్ధిచెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలతో.. ఈసారి దీపావళికి పటాకులు ఆశించిన స్థాయిలో పేలే అవకాశం కనిపించటం లేదు.
ఇదీ చూడండి: