ఉత్తరప్రదేశ్ హాథ్రస్ బాలిక అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని కుదిపేసిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఘటన గురించి వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన జర్నలిస్ట్ వద్ద విప్లవ సాహిత్యం ఉందంటూ పోలీసులు దేశద్రోహం కేసు పెట్టి అరెస్టు చేయడాన్ని సీపీఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండిస్తోందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దేశ ద్రోహం కేసులు పెట్టడం అలవాటైందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం తెలంగాణ శాఖ రెండు రోజుల రాష్ట్ర కమిటీ సమావేశాలకు రాఘవులు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను భాజపా ప్రభుత్వం కాలరాస్తోందని ధ్వజమెత్తారు.
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ, విద్యుత్ చట్టాలు తెలంగాణ రైతాంగాన్ని సర్వనాశనం చేస్తాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. విద్యుత్ చట్టం అమలైతే రాష్ట్రంలో ఉచితంగా విద్యుత్ అందుతున్న 25లక్షల బోర్లకు మీటర్లు బిగిస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోన్న చట్టాలను వ్యతిరేకిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్యే వివేకానంద క్షమాపణలు చెప్పారు: తహసీల్దార్ల సంఘం