Kunamneni Sambasiva Rao on Telangana Liberation Day: సాయుధ పోరాటం వల్లే తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. భాజపా, ఆర్‌ఎస్ఎస్ విలీనం కాదని.. విమోచనం అంటున్నాయని అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. తెలంగాణ సాయుధ పోరాటంలో భాజపాకు సంబంధమే లేదని కొట్టి పారేశారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని విలీనంగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమైక్యతా దినం అంటే అర్థం లేదని పేర్కొన్నారు. చరిత్రను చరిత్రగా తీసుకురాకపోతే సమాజానికి, దేశానికి ద్రోహం చేసిన వాళ్లవుతారని తెలిపారు.
భాజపా అధికారంలోకి వచ్చాక తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడిన వాళ్లకు పింఛన్ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. రేపటి నుంచి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తామని.. ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న మగ్ధుమ్ మోహినుద్దీన్ విగ్రహం నుంచి వారోత్సవాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యానికి గవర్నర్ వ్యవస్థ అంత మంచిది కాదన్నారు. గవర్నర్ వ్యవస్థను తమిళి సై దుర్వినియోగం చేస్తున్నారని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఈ నెల17న ఎగ్జిబిషన్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.
'భాజపా, ఆర్‌ఎస్ఎస్ వాళ్లు విలీనం కాదు.. విమోచనం అంటున్నారు. విమోచనం అంటే ముస్లిం పాలకుల నుంచి హిందువులకు విమోచనం కల్గింది. దేశ భక్తులు ఎప్పుడు కూడా మతం, కులం ప్రాతిపదికన సమాజాన్ని విచ్ఛిన్నం చేయరు. అలా చేస్తే అది ఓట్ల కోసమే తప్ప దేశభక్తి కాదు. చరిత్రను చరిత్రగా తీసుకురాకపోతే సమాజానికి, దేశానికి ద్రోహం చేసిన వాళ్లవుతారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని విలీనంగా ప్రభుత్వం ప్రకటించాలి.'-కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి: