ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య (Anandaiah medicine) ఆయుర్వేద వైద్యానికి ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ( Cpi Narayana) డిమాండ్ చేశారు. ఆనందయ్య ఆయుర్వేదంపై అనవసర అపోహలు సృష్టించి అడ్డదారుల్లో మందు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. వైకాపాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి.. ఆనందయ్య ఆయుర్వేద మందును రహస్యంగా దిల్లీ వరకు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.
గత 30 ఏళ్లుగా ఆనందయ్య క్షేత్రస్థాయిలో ఆయుర్వేద వైద్యం చేస్తున్నారని నారాయణ తెలిపారు. తానూ కృష్ణపట్నం వెళ్లి ఆనందయ్య ఆయుర్వేద వైద్యాన్ని పరిశీలించినట్లు చెప్పారు. నిజానికి ఆనందయ్య ఆయుర్వేద వైద్యంలో ఎలాంటి దుష్పలితాలు లేవన్నారు. ఒకవేళ ఏమైనా ఉంటే రోజుకు 600 నుంచి 700 మంది కొవిడ్ రోగులు వైద్యం కోసం వచ్చే వారు కాదన్నారు. ఆనందయ్య ఇప్పటివరకు దాదాపు 60 నుంచి 70 వేల మందికి వైద్యం అందించారని నారాయణ చెప్పారు.
కోటయ్య అనే వ్యక్తికి ఆయుర్వేద వైద్యం వికటించిందని చెప్పడంలో వాస్తవం లేదన్న సీపీఐ నారాయణ.. అతనికి చక్కెర వ్యాధి ప్రభావం వల్ల అలా జరిగిందని నిర్ధారించినట్లు పేర్కొన్నారు.
పుత్తూరు కట్టు, చేప మందు వంటి గ్రామీణ ప్రాంత నాటు, ఆయుర్వేద వైద్యాలు ఎన్నో ఉన్నాయని నారాయణ గుర్తుచేశారు. ఆయుర్వేద వైద్యానికి లేబోరేటరీ వైద్యంతో ముడి పెట్టరాదని సూచించారు. అల్లోపతికి.. ఆయుర్వేదానికి పోటీపెట్టడం సరికాదని నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ రెండు రంగాల్లో దేని ప్రత్యేకత దానికి ఉంటుందన్నారు. ఆనందయ్య ఆయుర్వేద వైద్యాన్ని రాద్ధాంతం చేయడం వల్లనే... ప్రభుత్వం, ఐసీఎంఆర్(ICMR), ఆయుష్ (Ayush) విభాగాలు కూడా వైద్యాన్ని కొనసాగించడానికి.. అనుమతి ఇవ్వడానికి ఇబ్బందులు పడుతున్నాయన్నారు.
అనుమతులు రాకపోవడం వెనుక కార్పొరేట్ శక్తులు (corporate organisations)ఉన్నాయని నారాయణ అనుమానం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్(Corona Vaccination), కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చుచేసినా.. ఎంతోమంది చనిపోతున్నా.. పట్టించుకోని ప్రభుత్వం.. ఆనందయ్య వైద్యాన్ని ఆపేయాలని చెప్పడంలో ఆంతర్యమేంటో అర్థం కావడం లేదన్నారు.