CPI Narayana fire on AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని రాజకీయ హత్యలు జరిగే అవకాశం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న... సీబీఐ అధికారుల మీదే ఏపీ ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆరోపించారు. తమ సినిమాలకు రాయితీ, ఇతరత్రా స్వార్థం కోసమే చిరంజీవి సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి కాళ్లు, చేతులు పట్టుకున్నారని అన్నారు. అగ్ర కథానాయకుడైన చిరంజీవి.. సినిమా టికెట్ల గొడవపై ప్రభుత్వంతో మాట్లాడటానికి ఇతర సంఘాలను తీసుకెళ్లాలనే ఆలోచన చేయలేదన్నారు.
అందుకే యువత తిరగబడుతుంది..
సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం కారణంగానే యువత తిరగబడుతున్నారని నారాయణ తెలిపారు. తాను కూడా బీమ్లా నాయక్ సినిమాకు రాత్రి వెళ్లొచ్చానన్న నారాయణ.. ప్రభుత్వం నిర్వాకంతో సినిమాకు వెళ్లిన వారు లోపల భయంగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అఖండ, బీమ్లా నాయక్ సినిమాలు సమాజానికి సందేశాన్ని ఇచ్చేవి కాకపోయినా.. వినోదం పంచుతున్నాయని అన్నారు.
'వైఎస్ వివేకా హత్యకు సీబీఐ విచారణ అవసరం లేదు. మొత్తం బయటపడింది. ఎవరు చంపారు? ఎందుకు చంపారో తెలిసింది. వైఎస్ జగన్ ఫ్యామిలీ దీనికి నైతిక బాధ్యత వహించాల్సిందే. సీబీఐమీద ప్రభుత్వం ఎదురు దాడి చేస్తోంది. భవిష్యత్లో ఇంకా రాజకీయ హత్యలు కొనసాగుతాయి. కోల్డ్ బ్లడ్ మర్డర్లు జరుగుతాయి. ముఖ్యమంత్రి సంకుచిత వైఖరి వల్ల కల్చరల్ రంగంలో సంక్షోభం వచ్చింది. సినిమాలు కూడా భయంభయంగా చూడాల్సి వస్తోంది.'
-సీపీఐ నారాయణ
ఇదీ చదవండి: భాజపా కార్యకర్త దాడిలో దళిత యువకుడు మృతి- రాముని గుడి ముందే!