మిషన్ భగీరథ పథకంలో పని చేస్తున్న వర్క్ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లను కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ పథకంలో 2015 నుంచి దాదాపు వెయ్యి మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు కష్టపడి పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పథకం విజయవంతంగా కొనసాగడానికి వారు అహర్నిశలు శ్రమించారని తెలిపారు.
సంబంధిత శాఖ మంత్రివర్యులు, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లను కూడా వారి ఉద్యోగాల్లో కొనసాగించాలని తెలిపారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం వలన ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. సుమారు 700 కుటుంబాలు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మిషన్ భగీరథ పథక నిర్వహణకు సిబ్బంది ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే ఉద్యోగ నియామకాల్లో వీరికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మానవతా దృక్పథంతో వారిని తమ ఉద్యోగాల్లో కొనసాగుటకు సత్వరం చర్యలు తీసుకోవాల్సిందిగా చాడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చూడండి : 'సీఎం నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేదు'