రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి విడతలో భాగంగా రాష్ట్రానికి మొత్తం 3.84 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు రాగా అందులో 3.64 లక్షల డోస్‌లు సీరం ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన కోవిషిల్డ్ కాగా మరో 20 వేల డోస్‌లు భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్ టీకావి కావడం గమనార్హం. 16 ముందుగా 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్న వారికి సరిపడా వ్యాక్సిన్ డోస్‌లను కేటాయించినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ 13, జగిత్యాల, జనగామ, మంచిర్యాల,మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండేసి కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
ప్రభుత్వం ఆధీనంలోనే..
ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్, నల్గొండ, నారాయణ్‌పేట్, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రిలో 3 చోట్ల, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, వరంగల్ రూరల్‌లో నాలుగేసి చోట్ల, ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ అర్బన్‌లో ఆరు చోట్ల వ్యాక్సిన్ సైట్స్‌ని నిర్వహిస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి 11, రంగారెడ్డి జిలాలో 9 చోట్ల వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మొత్తంగా 139 కేంద్రాల్లో మొదటి రోజు వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందు నుంచి 40 ప్రైవేట్, 99 చోట్ల వ్యాక్సిన్ ఇవ్వాలని భావించినప్పటికీ కేవలం ప్రభుత్వ కేంద్రాలలోనే వాక్సినేషన్ నిర్వహించాలని భావించి తగు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
ఆ ఆరు జిల్లాలకు ఇవాళ..
శనివారం నుంచి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో లబ్ధిదారులకు అనుగుణంగా వ్యాక్సిన్ డోస్‌లు కేటాయించేది. మొత్తం 27 జిలాల్లకు నేడు వ్యాక్సిన్ పంపిణీ పూర్తి చేయగా మరో ఆరు జిల్లాలకు గురువారం వ్యాక్సిన్ పంపనున్నారు. అందులో భాగంగా ఆదిలాబాద్ 2,370, హైదరాబాద్ 18,070, జగిత్యాల 840, జనగామ 830, జోగులాంబ గద్వాల 880, కామారెడ్డి 800, కరీంనగర్ 1,540, మహబూబాబాద్ 1,720, మహబూబ్‌నగర్ 1,730, మంచిర్యాల 460, మెదక్ 790, మేడ్చల్ మల్కాజిగిరి 3,270, నాగర్‌కర్నూల్ 230, నల్గొండ 1,280, నిర్మల్ 1340, నిజామాబాద్ 1,320, పెద్దపల్లి 380, రాజన్న సిరిసిల్ల 1,280, రంగారెడ్డి 1,190, సంగారెడ్డి 780, సిద్దిపేట 1,790, సూర్యాపేట 470, వికారాబాద్ 460, వనపర్తి 660, వరంగల్ రూరల్ 580, వరంగల్ అర్బన్ 2,640, యాదాద్రి భువనగిరి 1,160 డోస్‌లు పంపిణీ చేశారు. ఇక ఆసిఫాబాద్‌కి 280, ఖమ్మం జిల్లాకు 1,530, భద్రాద్రి కొత్తగూడెం 700, ములుగు 500, జయశంకర్ భూపాలపల్లి 560, నారాయణపేట్ 1,140 డోస్‌లు కేటాయించగా... ఆ ఆరు జిలాలకు ఇవాళ వ్యాక్సిన్‌ని తరలించనున్నట్టు సమాచారం.
సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా..
వ్యాక్సిన్ డోస్‌లు కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో రిజిస్టర్ చేసుకున్న ఆరోగ్య సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా కేటాయించిన సర్కారు... హైదరాబాద్‌కి అత్యధికంగా 18,070, నాగర్కర్నూల్కి అత్యల్పంగా 230 డోస్‌లు కేటాయించింది. గురువారం సాయంత్రానికి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ పంపిణీ పూర్తి చేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. నాగర్‌కర్నూలు జిల్లాకు 230 డోసుల కొవిడ్ వ్యాక్సిన్ చేరుకుంది. రాష్ట్ర శాఖ నుంచి పంపిణీ చేయబడిన వ్యాక్సిన్ ఈ రోజు రాత్రి 10 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి చేరుకుంది. వ్యాక్సిన్‌ను స్వయంగా జిల్లా వైద్య అధికారి సుధాకర్ లాల్ రిసీవ్ చేసుకుని జిల్లా కార్యాలయంలోని కోల్డ్ స్టోరేజ్ రూమ్‌లో భద్రపరిచారు. 32 కేంద్రాల ద్వారా మొదటి విడతగా వైద్యులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి వ్యాక్సిన్‌ను అందజేయనున్నారు.
ఇదీ చూడండి: 5 కిలోల గోధుమ గింజలతో కరోనా సందేశం