రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. లాక్డౌన్, కరోనా విజృంభణ దృష్ట్యా టీకా తీసుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,045 మందికి తొలిడోసు, 38,510 మందికి రెండో డోసు వ్యాక్సిన్ ఇచ్చినట్లు వైద్య,ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్కరోజులో వ్యాక్సిన్ తీసుకుంది కేవలం 39,555 మంది మాత్రమే. ఇప్పటి వరకు రాష్ట్రంలో 43,75,396 మంది మొదటి డోసు టీకా పూర్తిచేసుకోగా.. మరో 11,03,872 మంది రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఇప్పటివరకు రాష్ట్రానికి కేంద్రం నుంచి 55,91,920 వ్యాక్సిన్ డోసులు రాగా.. 62,970 టీకాలను రాష్ట్ర సర్కార్ ఆర్మీకి కేటాయించింది. మరో 55,79,268 వ్యాక్సిన్ డోసులను ప్రజలకోసం వినియోగించారు. 0.90 శాతం వ్యాకిన్ వృధా అయినట్లు ఆరోగ్య శాఖ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్య తగ్గడం గమనార్హం. గతంలో దాదాపు 1200లకు పైగా ఉన్న కేంద్రాల సంఖ్య ప్రస్తుతం 901కి తగ్గింది. అందులో 12 ప్రైవేట్ కేంద్రాలు ఉన్నాయి.
- ఇదీ చదవండి స్పుత్నిక్ వి టీకా ధర రూ.995.40