జూన్ వచ్చిందంటే చాలు పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులు, స్టేషనరీ కొనుగోళ్లతో కళకళలాడాల్సిన పుస్తక విక్రయశాలలు కొవిడ్ కారణంగా కళతప్పాయి. పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోకపోవడం వల్ల ఆన్‌లైన్‌లోనే విద్యాబోధన సాగుతోంది. ప్రత్యక్ష తరగతుల మొదలు కానందు వల్ల విద్యాభ్యాసానికి అవసరమైన సరంజామా సగానికి సగం తగ్గిపోయిందని విక్రయదారులు చెబుతున్నారు. సాధారణ రోజులతో పోల్చితే ప్రస్తుతం కేవలం 25 శాతం మాత్రమే వ్యాపారం సాగుతోందని...దుకాణ నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకూ కష్టమవుతోందని వాపోతున్నారు. బుక్ స్టాల్ వ్యాపారంలో ముఖ్యమైన స్టేషనరీ కొనుగోళ్లు డీలా పడిపోయాయి.
పుస్తక అమ్మకాలతో పాటు ప్రింటింగ్ పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలతో పాటు విద్యాలయాలు నడవక సరైన డిమాండ్ లేక చాలా వరకు ప్రింటింగ్ జరగని పరిస్థితి నెలకొంది. ఆరు నుంచి పదో తరగతి పుస్తకాలు మార్కెట్లో ప్రస్తుతం లభ్యం కావట్లేదు. పాఠశాల పుస్తకాల వ్యాపారం తుడిచిపెట్టుకోగా... ప్రస్తుతం యూజీ, పీజీ పరీక్షల సెమ్‌లకు సంబంధించిన పుస్తకాలే అమ్ముడవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాల ప్రకటనలు, పరీక్షల వాయిదాతో పోటీపుస్తకాలను అడిగే నాథుడే కరవయ్యారు. లాక్‌డౌన్ ఆంక్షలు, కోవిడ్ భయాలు లేకుండా తాము సైతం బుక్స్ ఆన్‌లైన్ డెలివరీ చేసి వ్యాపారం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నామని నిర్వాహకులు వివరించారు.
ఆన్‌లైన్ చదువులతో పుస్తక, స్టేషనరీ విక్రయదారులు వ్యాపారాల్లేక అరకొర అమ్మకాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గి మూడో దశ భయాలు పూర్తిగా తొలగిపోయి విద్యాసంస్థలు తెరుచుకుంటేనే తమ వ్యాపారాలు కుదుటపడతాయని పేర్కొంటున్నారు.