అంతిమ సంస్కారం మాటేలేదు. క్రతువులు కాదు కదా... తమవారిని కడసారైనా చూడలేని దుస్థితి. ఆస్తిపాస్తులు కావు.... చివరకు వచ్చేది ఆ నలుగురే అనే మాటలను ప్రస్తుత పరిస్థితులు నిజం చేస్తున్నాయి. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మృతిచెందింది. కరోనా మరణం అన్న అనుమానంతో అయినవారెవ్వరూ ఆమె అంత్యక్రియల నిర్వహణకు ముందుకు రాకపోవటంతో.... పురపాలిక సిబ్బందే దిక్కయ్యారు. చెత్తను తరలించే వాహనంలో మృతదేహాన్ని తీసుకువెళ్లి.... వృద్ధురాలి దహనసంస్కారాలు నిర్వహించారు.
కన్నకొడులే ఆలోచించారు..
కొవిడ్‌తో మరణించిన కన్నతండ్రిని కడసారి చూసేందుకు కన్నకొడులే ఆలోచించారు. చివరకు పోలీసుల చొరవతో ఇద్దరు కుమారులు వచ్చారు. మంచిర్యాలకు చెందిన ఓ వ్యక్తి శ్వాసకోస సమస్యలతో బాధపడుతూ స్థానికుల సాయంతో ఆస్పత్రిలో చేరారు. వైద్యులు పరీక్షించి, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో బాధితుని కుమారులకు వైద్యసిబ్బంది సమాచారం అందించారు. తండ్రి ప్రాణాపాయస్థితిలో ఉన్నా కొడుకులు రాకపోవటంతో సిబ్బంది ఆయనను అదేరోజు బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. కరోనా పరీక్ష నిర్వహించటంతో పాజిటివ్‌గా తేలింది. పరిస్థితి విషమించటంతో బాధితుడు మృతిచెందగా... ఆయన కుమారులతో మాట్లాడిన పోలీసులు వారిని అక్కడికి రప్పించారు.
20 మంది కానిస్టేబుళ్లకు వైరస్
మహబూబాబాద్ జిల్లాలో కొవిడ్ బారిన పడిన ఇద్దరు పోలీస్ సిబ్బంది నిలువనీడ లేక.... గుట్టల్లో తలదాచుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని ప్రత్యేక దళంలో 20 మంది కానిస్టేబుళ్లకు వైరస్ సోకగా.. ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. అద్దె ఇంట్లో ఉంటున్నందున యజమానులు రావొద్దని చెప్పారు. దిక్కులేక అడవుల బాటపట్టారు. లాక్‌డౌన్ సయమంలో సేవ చేసిన తమకే దిక్కు లేకుండా పోయిందని... పోలీసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
బెంచిమీదే..
ఇటీవల నల్గొండలో శ్వాస ఆడక ఓ యువకుడు కన్నతల్లి కళ్లముందే ప్రాణాలు కోల్పోయాడు. వైద్యుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తినా.. తాజాగా అదే రీతిలో వైద్యసిబ్బంది ప్రవర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యం కారణంగా జిల్లా ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలగా.. వైద్యులు కనీసం పట్టించుకోకుండా అక్కడే వదిలేశారు. అప్పటికే అస్వస్థతకు గురైన బాధితుడు.. ఆస్పత్రి ఆవరణలో బెంచిమీదే పడుకున్నాడు. సాయంత్రం అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు వీడియో తీస్తుండగా... అది గమనించిన వైద్య సిబ్బంది అతన్ని హైదరాబాద్‌కు తరలించారు.
నిరీక్షణ తప్పటంలేదు..
నల్గొండ జిల్లాలో కరోనా పరీక్షలకు వచ్చిన వారికి నిరీక్షణ తప్పటంలేదు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఫోన్ చేయించిన వారికి మినహా... మిగతా వారికి టెస్టులు చేయకపోవటంతో ఏడెనిమిది గంటల పాటు వరసలో నిల్చుంటున్నారు. కొత్తగా వచ్చిన సౌకర్యాలతో టెస్టుల సంఖ్య పెరుగుతున్నా.... కిట్ల కొరత తీవ్రంగా వేధిస్తోందని ప్రజలు వాపోతున్నారు.
ఇవీ చూడండి: రైళ్లు బంద్: ఉపాధి కోల్పోయిన వ్యాపారులు, కూలీలు