ఆరేళ్ల వయసున్న బాలుడిని తమకు అప్పగించాలని కన్నతల్లి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే.. అల్లారుముద్దుగా చూసుకుంటున్న తమ బిడ్డను ఇప్పుడు ఎలా ఇస్తామంటూ పెంచుకున్న తల్లి మనోవేదన చెందుతోంది.. ఈ ఘటన ఏపీలోని కోనసీమలో చోటుచేసుకుంది. ఆరేళ్ల క్రితం తమకు జన్మించిన మగబిడ్డ పురిట్లోనే చనిపోయాడని అబద్ధం చెప్ఫి... ఆసుపత్రి వైద్యుల సహకారంతో తమ బంధువు ఆ శిశువును వేరేవారికి అమ్మేశారని అమలాపురం మండలం ఇందుపల్లి గ్రామానికి చెందిన ధర్మాడి గంగాభవాని, నాగేంద్ర దంపతులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మలికిపురం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
బిడ్డ చనిపోయాడని చెప్పి..
వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. గంగాభవాని, నాగేంద్ర ప్రేమ వివాహం చేసుకున్నారు. 2014 ఫిబ్రవరి 6న గంగాభవాని ప్రసవం నిమిత్తం తన మేనత్త పితాని రామలక్ష్మితో కలిసి మలికిపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. సిజేరియన్ చేసిన తరువాత పుట్టిన బిడ్డ చనిపోయాడని ఆమెకు చెప్పారు. రెండేళ్ల తరువాత ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల తమ మొదటి బిడ్డ చనిపోలేదని, అలా అబద్ధం చెప్పి అమలాపురానికి చెందిన కట్టా నాగేశ్వరరావుకు అమ్మేశారన్న విషయం బంధువుల ద్వారా తెలిసింది. తమ మగబిడ్డను తమకు అప్పగించి న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించామని గంగాభవాని, నాగేంద్ర చెబుతున్నారు. ఆరేళ్ల క్రితం పుట్టిన బిడ్డను ఎవరికీ తెలియకుండా అమ్మేశామని చెప్పడం వాస్తవం కాదని మేనత్త రామలక్ష్మి చెబుతోంది.
అంగీకారంతోనే తీసుకెళ్లాం..
బాలుడిని పెంచుకుంటున్న కట్టా నాగేశ్వరరావు మాట్లాడుతూ... అప్పట్లో గంగాభవాని, ఆమె తండ్రి అంగీకారంతోనే బిడ్డను తాము తీసుకెళ్లామని చెప్పారు. బిడ్డను ఆరేేళ్ల నుంచి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామన్నారు. ఇప్పుడు పోలీసు కేసు పెట్టారన్న సమాచారం తెలిసినప్పటి నుంచి తన భార్య తీవ్ర ఆందోళనకు గురై మంచం పట్టిందని ఆవేదనకు గురయ్యారు. గంగాభవాని, నాగేంద్రల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మలికిపురం ఎస్సై నాగరాజు తెలిపారు.
ఇవీ చూడండి: భార్యే హంతకురాలు.. సాఫ్ట్వేరు మర్డర్ కేసులో కొత్త కోణాలు