Country Chicken in Hyderabad : ఆలోచనలు కొత్తగా ఉంటే.. వ్యాపార రంగం అంతే కొత్తగా ప్రతిబింబిస్తుందనడానికి నిదర్శనం ఈ కుర్రాళ్లు. హైదరాబాద్‌లోని కూకుట్‌పల్లి ప్రగతినగర్‌లో నాటుకోళ్ల మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇందులో కొత్తేమీ ఉందనేగా మీ సందేహం. చాలా చోట్ల నాటుకోళ్ల మాంసాన్ని విక్రయిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా వీరు ఎంచుకున్న విధానం.. నాటుకోడి తినాలనుకునే చికెన్ ప్రియులను ప్రగతినగర్ వైపు పరుగులు పెట్టిస్తోంది.
పాప్‌కార్న్ వ్యాపారం కుదేలు..
Country Chicken Outlet : ఐఐటీ వారణాసిలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన సాయికేష్.. వ్యాపారవేత్తగా స్థిర పడాలి అనుకున్నాడు. ఇందుకోసం తొలుత సినిమా థియేటర్లకు పాప్‌కార్న్ విక్రయించే కార్న్ క్వెస్ట్ ప్రైవేట్ లిమిడెట్ అనే స్టార్టప్ ప్రారంభించాడు. వ్యాపారం బాగా పుంజుకుంటుదనేలోగా.. కరోనా ప్రభావంతో సినిమాహాల్స్ మూతపడ్డాయి. ఫలితంగా.. పాప్‌కార్న్ వ్యాపారం కుదేలైంది.
తొలుత ఆన్‌లైన్‌లో..
Country Chicken Outlet in Hyderabad : కరోనా సమయంలో చికెన్ విక్రయాలు ఊపందుకోవడం గమనించాడు. నగరవాసులకు ఆరోగ్యవంతమైన నాటుకోడి మాంసం విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితుడు సమీఉద్దీన్‌తో కలిసి నాటుకోళ్ల పెంపకం, విక్రయాలు, లాభనష్టాలపై ఆరాతీశాడు. తెలిసిన రైతు హేమాంబర్ రెడ్డి ద్వారా నాటుకోళ్లు పెంచడం మొదలుపెట్టారు. తొలుత ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్ ద్వారా కంట్రీ చికెన్ కో పేరుతో విక్రయాలు మొదలుపెట్టారు. వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది.
ప్రగతినగర్‌లో ఆఫ్‌లైన్ ఔట్‌లెట్..
Country Chicken Outlet at Kukatpally : క్లాసిక్ ఆంధ్ర, మైసూర్ క్వీన్, భీమవరం పందెం కోళ్లు, టెండర్ తెలంగాణ, కడక్ నాథ్ వంటి వివిధ రకాలైన నాటుకోడి మాంసం విక్రయానికి కూకట్ పల్లి ప్రగతినగర్ లో ప్రత్యేకంగా ఫామ్ ఔట్ లెట్ తెరిచారు.
"2020లో ఈ ప్రాజెక్ట్‌పై పనిచేశాం. 2021 అక్టోబర్‌లో ఆన్‌లైన్‌లో మొదలుపెట్టాం. అప్పటి నుంచి ప్రజలు నాటుకోడిపై ఉన్న ప్రేమను చూపిస్తూనే ఉన్నారు. మాకు లాభాలు అందిస్తూనే ఉన్నారు. ఇండియా మొత్తంలో లైవ్ బర్డ్స్ పెట్టడమే కాకుండా.. శుభ్రతను పాటించే ఏకైక ఔట్‌లెట్ కంట్రీ చికెన్‌దే. ఈ విషయంలోనే మాకు ఐకార్ ఎన్‌ఆర్‌సీఎం వారు మమ్మల్ని ప్రశంసించారు. రైతు నుంచి వచ్చినప్పటి నుంచి వినియోగదారులకు మాంసం అందించే వరకు మాకు 42 క్వాలిటీ చెక్స్ ఉంటాయి. మేం చేతులతో కాకుండా మెషీన్లతో మాంసాన్ని కట్ చేస్తాం."
- సాయికేష్, సీఈవో కంట్రీ చికెన్
12వేల రైతులతో ఒప్పందం..
Country Chicken Outlet at Pragathi Nagar : తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల్లో నాటుకోళ్లు మాత్రమే పెంచే సుమారు 12 వేల మంది రైతులతో ఒప్పందం చేసుకున్నారు. వారికి కోడిపిల్లలను ఇచ్చి సహజ వాతావరణంలో పెంచేలా అవగాహన కల్పించారు. అలా వ్యవసాయ క్షేత్రాల నుంచి నేరుగా ఔట్‌లెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
నాటుకోడితో లాభాలు..
కంట్రీచికెన్ ఔట్ లెట్‌లో అడుగుపెట్టే చికెన్ ప్రియులకు.. నాటుకోడి తినడం ద్వారా కలిగే ప్రయోజనాలు, వాటిని పెంచే పద్ధతులు అడుగడుగునా కనిపిస్తాయి. అంతేకాకుండా నాటుకోడి మాంసం ప్రాసెసింగ్ కూడా చాలా పరిశుభ్రమైన వాతావరణంలో చేస్తుండటం చికెన్ ప్రియులను మరింత ఆకర్షిస్తోంది.
ఆరోగ్యకరమైన చికెన్ అందిస్తాం..
ఔత్సాహిక వ్యాపారులుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన సాయికేష్, సమీఉద్దీన్‌లు.. ఓటమి నుంచి నేర్చుకునే పాఠాలు.. తమ భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను ఆరోగ్యవంతమైన చికెన్ అందించాలనే లక్ష్యంతో కంట్రీ చికెన్ ఔట్ లెట్లను నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో విస్తరిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.