జన్యు పరంగా కొన్ని జంతువులకూ మనకూ చాలా దగ్గర సంబంధాలుంటాయి. ఏదైనా కొత్త వ్యాధి వచ్చినప్పుడు దానికి మందు కనిపెట్టడానికి చేసే ప్రయోగాలన్నీ ముందు వాటి పైనే చేస్తారు.
అవి విజయవంతమైతే మనుషుల మీద ప్రయోగిస్తారు. ఈ ‘యానిమల్ ట్రయల్స్’ సంగతి అలా ఉంచితే, నేరుగా కొన్ని జీవుల నుంచే కరోనా వైరస్‌కు టీకా/ ఔషధాలను అభివృద్ధి చేయవచ్చని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆ మేరకు ప్రయోగాలూ చేస్తున్నారు.
కరోనా జన్యువులకు సంబంధించిన ఆనవాళ్లు గబ్బిలాల్లో ఉన్నాయి. వీటితోనే ఈ వ్యాధి మనుషులకు సోకిందని మొదట్లో అందరూ అనుకున్నారు కూడా. కానీ, వాటికే ‘పాపం’ తెలీదని తర్వాత తేలింది. గబ్బిలం నుంచి మనుషులకు ఈ వైరస్‌ను చేరేసింది పాంగోలిన్ అనే క్షీరదం.
మనుషులకు చాలా హానిచేస్తున్న కరోనా వైరస్ ఈ రెండు ప్రాణులనూ ఏమీ చేయలేకపోతోంది. కాబట్టి వాటి రోగ నిరోధక వ్యవస్థలను లోతుగా పరిశీలించి కరోనా వైరస్‌కి మందు తయారు చేసే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. కరోనా ఒక్కటే కాదు, ఒంట్లో బోలెడు ఇతర వైరస్‌లను పెట్టుకున్న గబ్బిలాలకు ఎందుకు ఏమీ కావట్లేదు? అంటే, వైరస్‌ల సంఖ్యను కట్టడి చేసే ప్రత్యేక వ్యవస్థ వాటిలో ఉందట. దాని గుట్టుమట్లను తెలుసుకుంటే ఉపయోగకరమన్నది శాస్త్రవేత్తల ఆలోచన.
పీతల రక్తదానం
అట్లాంటిక్ సముద్ర తీరాల్లో గుర్రపు డెక్క పీతలు కనిపిస్తాయి. ఇవి కూడా మనుషులకు చేతనైనంత సాయపడుతున్నాయి. నీలం రంగులో ఉండే ఈ పీతల రక్తం సూక్ష్మక్రిముల సంహారంలో ఉపయోగపడుతుంది. వైరస్‌లకు టీకా కనిపెట్టిన తర్వాత అందులో ఉండే కలుషిత పదార్థాలను గుర్తించడానికి ఈ పీతల రక్తాన్ని వాడతారు. కొంచెం రక్తాన్ని తీసుకుని వాటిని మళ్లీ సముద్రంలో వదిలేస్తారు. ప్రస్తుతం కరోనా వైరస్‌కి టీకా కనిపెట్టే పనిలో ఉన్న శాస్త్రవేత్తలకు వీటితో కొంచెం ఎక్కువ పని పడింది.
ఎలుకల నుంచి ఫెర్రేట్స్ వరకూ
కొత్త మందుల ఆవిష్కరణతో పాటు ఇతర అనేక విషయాల్లో వైద్య పరిశోధకులకు ముందుగా గుర్తుకొచ్చేవి ఎలుకలు. జీవ శాస్త్ర పరంగా మనకూ, వీటికీ డీఎన్‌ఏ 98 శాతం ఒకేలా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ, మెదడు కూడా మన మాదిరిగానే పనిచేస్తాయి. అంతే కాదు మనకు వచ్చే జబ్బుల్లాంటివే వీటికీ వస్తాయి. అమెరికాలో ఎక్కువగా ఎలుకల మీద పరిశోధన చేస్తారు. అక్కడ సంవత్సరానికి దాదాపు పది కోట్ల ఎలుకల మీద ప్రయోగాలు జరుగుతాయి. ప్రయోగాలకు కావాల్సిన ఎలుకలను ప్రత్యేకంగా పెంచుతారు.
మనిషి కోతి నుంచి పుట్టాడంటారు. అందుకేనేమో మన డీఎన్‌ఏ వాటి డీఎన్‌ఏ దాదాపు సమానం. అంతే కాదు, రోగ నిరోధక శక్తులూ ఒకేలా ఉంటాయి. పందులకూ మనుషుల్లానే రోగ నిరోధక శక్తి ఉంటుంది. అందుకే టీకాలను వీటి మీద ప్రయోగిస్తారు. వచ్చిన ఫలితాలను బట్టి మనుషులకు ఇస్తారు. అలాగే, కరోనా వైరస్ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది కదా. అందుకని మన శ్వాసకోశ వ్యవస్థతో సరిపోయే వ్యవస్థ ఉన్న ఫెర్రేట్స్ మీద టీకా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇవి ఎక్కువగా యూరప్‌లో ఉంటాయి.
కరోనాకు బ్యారికేడ్లు
ఆల్పాకస్, లామాస్ అనే జంతువులు చూడ్డానికి ఉన్ని గొర్రెల్లా ఉంటాయి. కానీ ఇవి ఒంటె జాతికి చెందినవి. ఆండీస్ పర్వతాల్లో ఎక్కువగా నివసిస్తాయి. వీటి రక్తంలో ఉండే నానోబాడీలు కరోనా వైరస్‌ను ఎదుర్కోగలవని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ సూక్ష్మకణాలతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి వైరస్ వ్యాప్తి తగ్గుతుందని అంటున్నారు స్వీడన్, దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు. ఈ పరిశోధన ఆధారంగా కొత్త మందు త్వరగా తయారవుతుందేమో మరి!