హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ హ్యువెల్ లైఫ్‌సైన్సెస్ చౌకలో కరోనా నిర్ధారణ కిట్‌ను అభివృద్ధి చేసింది. కనీస వ్యయంతో దాని ద్వారా రెండున్నర గంటల్లో ఫలితం పరీక్ష ఫలితం తెలుసుకోవచ్చునని చెప్తోంది. తాజాగా ఈ సంస్థ రూపుదిద్దిన కిట్లకు ఐసీఎంఆర్ ఆమోదం తెలపగా భారీగా ఉత్పత్తి చేసేందుకు బాట పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కిట్ల కొరత ఉన్నందున ఇప్పటికే ప్రభుత్వం వీరిని సంప్రదించింది. సంస్థ ప్రతినిధులు ఇప్పటికే పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ను కలిసి దీని గురించి వివరించారు. సోమవారం నుంచి కిట్ల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ శిశిర్ ‘ఈనాడు’ ముఖాముఖిలో వెల్లడించారు.
దేశీయంగా సమకూర్చుకుంటూ..
దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలను ఆర్‌టీ పీసీఆర్‌పై చేస్తున్న క్రమంలో అందుకు అవసరమయ్యే కిట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్, ఆయా దేశాల్లోనూ కిట్ల అవసరం ఉండగా మనం కొరత ఎదుర్కొంటున్నాం. పరీక్షలకు కిట్‌లో ఉపయోగించే భాగాల(కంపోనెంట్స్)నూ దిగుమతి చేసుకుంటుండగా ఒక్కో కిట్‌కు అయ్యే వ్యయం రూ.4500 వరకు చేరుతోంది. హ్యువెల్ లైఫ్‌సైన్సెస్ కిట్‌లో ఉపయోగించే రెండు రకాల ఎంజైమ్స్, బఫర్స్, ప్రైమర్స్ అన్ని దేశీయంగా సమకూర్చుకోవడం వల్ల స్వల్ప వ్యయంతో కిట్ తయారుచేయవచ్చు. ఒక్కో కిట్‌ను సుమారు వంద వరకు పరీక్షలకు ఉపయోగించవచ్చు. నిర్ధారణ పరీక్షను రూ.1500లోపే చేయవచ్చు.
తక్కువ వ్యవధిలోనే..
రియల్‌టైమ్ పీసీఆర్‌పైన నిర్ధారణ పరీక్ష చేస్తారు. ఆర్‌ఎన్‌ఏ ఆధారిత పరీక్ష ఇది. గొంతు, ముక్కు లోపల నుంచి కఫం తీసి పరీక్షిస్తారు. రెండున్నర గంటల్లోనే ఫలితాలు తెలుసుకోవచ్చు. కొవిడ్-19తో పాటూ సార్స్ ఆధారిత వైరస్‌ల నిర్ధారణకూ ఈ కిట్ పనిచేస్తుంది.
25 రోజుల్లోనే..
ఎంజైమ్స్, బఫర్స్ సిద్ధంగా ఉన్నందున కిట్‌ని ఇరవై నుంచి 25 రోజుల్లో అభివృద్ధి చేశాం. మా బృందంలో మొత్తం 21 మందిమి దీనికోసం శ్రమించాం. నార్సింగిలో మా కార్యాలయం ఉంది. సీసీఎంబీలోని అటల్ ఇంక్యుబేషన్ కేంద్రంలో వర్చువల్ ఇంక్యుబేటర్‌గా అక్కడి ప్రయోగశాలను వినియోగించుకున్నాం.