లాక్‌డౌన్ ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న స్థిరాస్తి రంగం రెండోదశ కరోనా మళ్లీ నిలిచిపోతుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే... తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్‌లో నిర్మాణ ప్రారంభోత్సవాలు ఇటీవల పెద్దఎత్తున ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది తొలి మూడ్నెళ్లలోనే ఇతర నగరాలతో పోల్చితే.... హైదరాబాద్‌లో 211శాతం ప్రారంభోత్సవాలు పెరిగాయి. నిర్మాణ సామాగ్రి సిమెంటు, స్టీలు, ఇసుక, కంకర, ఇతర ముడి పదార్ధాల ధరలు పెరిగిపోయినా... చాలావరకు బిల్డర్లు పనులు ఆటంకం లేకుండా కొనసాగిస్తూ వచ్చారు. ఈ తరుణంలోనే రెండో దశ కరోనాతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. గత 10 రోజులగా రాష్ట్రంలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరిగిపోతుండటంతో పనులన్నీ ఆగిపోయాయి. కొందరు బిల్డర్లు, కూలీలు వైరస్ బారీన పడటంతో భయంతో సైట్ల వద్దకూ వెళ్లటంలేదు. నిర్మాణాలు పూర్తై చిన్నచిన్న పనులు మిగిలి ఉంటే... వాటిని మాత్రమే పూర్తిచేస్తున్నారు తప్పిస్తే... పెద్ద సంఖ్యలో కూలీలు అవసరమైన పనులన్నీ దాదాపు నిలిచిపోయాయి.
మరోవైపు కూలీలు కూడా భయంతో పనులకు రావడానికి విముఖత చూపుతున్నారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వారు సొంతూళ్లకు వెళ్లిపోగా.... మరికొందరు అదేబాట పడుతున్నారు. దీంతో... కూలీలను నిలువరించేందుకు క్రెడెయ్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాష్ట్రంలో ఉన్న వలస కూలీల బాగోగులు చూసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రధానంగా కూలీలందరికి వ్యాక్సిన్ వేయించాలని భావించినా... ప్రభుత్వమే వేస్తామనటంతో ప్రస్తుతం ఆ సమస్య సమసిపోయింది. కరోనా భయంతో పనులు చేయని, చేయలేని పరిస్థితుల్లో కూడా వారికి ఆశ్రయం కల్పించి భోజనాలు ఏర్పాటు చేయాలని క్రెడెయ్ యోచిస్తోంది.
గత ఏడాదిలో కరోనా ప్రభావంతో స్థిరాస్తి రంగం తీవ్రంగా నష్టపోగా... మరోసారి అలాంటి పరిస్థితులు నెలకొంటుడంతో బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తమకు అండగా నిలువాలని కోరుతున్నారు. బిల్డింగ్ సెస్ దాదాపు 15వందల కోట్ల వరకు ఉండటంతో... కొంతవెసులుబాటు వచ్చేలా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు క్రెడాయ్ ప్రతినిధులు చెబుతున్నారు.