పండుగలు, పుట్టిన రోజు, పెళ్లిరోజు ఇలా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మిఠాయిలు ఉండాల్సిందే. ఐతే కరోనా దెబ్బకు అందరికీ తీపిని అందించే మిఠాయి దుకాణాల యజమానుల జీవితాలు చేదేక్కుతున్నాయి. సాధారణ రోజులతో పోల్చితే.. 30శాతం మేర మాత్రమే వ్యాపారం జరుగుతోందని మిఠాయి దుకాణదారులు చెబుతున్నారు. కొనేవారు లేక ఇప్పటికే కొన్ని షాపులు మూతపడ్డాయి. మరికొందరు మిక్చర్, బూందీ, చెకోడీ వంటివి తయారు చేస్తూ దుకాణం నడిపిస్తున్నారు. రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలపైనే యజమానులు ఆశలు పెట్టుకున్నారు. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతోన్న తరుణంలో ఈ పండుగ సీజన్‌లోనూ నష్టాలు తప్పవనే ఆందోళన నెలకొంది.
స్వీట్ల కొనుగోళ్లకు అనాసక్తి...
గిరాకీలు లేక మిఠాయి దుకాణాల్లో పనిచేసే కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ప్రజలూ స్వీట్లు కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపించని నేపథ్యంలో... ఉన్న వారి తోనే నెట్టుకొస్తున్నారు. సగం పని వారి తోనే చాలా దుకాణాలు నడిపిస్తున్నారు. పాత వినియోగదారులు... నమ్మకం ఉన్న వారు మాత్రమే మిఠాయిలు కొనుగోలు చేస్తున్నారని యజమానులు చెబుతున్నారు. కరోనా సమయంలో వినియోగదారులు బయటి పదార్థాలను తినడం తగ్గించారని పేర్కొంటున్నారు.
ఆశాభావంతో..
కొనుగోళ్లు తగ్గినా.. కొన్ని షాపుల వాళ్లు మాత్రం కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ విక్రయాలు చేస్తున్నారు. వచ్చే రాఖీ పౌర్ణమి, దసరా, దీపావళి పండుగల వేళ విక్రయాలు కొంతమేర పెరుగుతాయని దుకాణాదారులు ఆశాభావంతో ఉన్నారు.
ఇవీ చూడండి: మానవతా బంధాలను తుంచేస్తున్న కరోనా..