ముస్లింల పండుగల్లో బక్రీద్ ప్రధానమైనది. త్యాగానికి ప్రతీకైన ఈ పండుగ రోజున ముస్లింలు తప్పనిసరిగా మేకలను బలిస్తారు. ఈ నేపథ్యంలో గొర్రె, మేక పొట్టేళ్లకు చాలా గిరాకీ ఉంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితి అందుకు భన్నింగా తయారైంది. లాక్‌డౌన్ ఆంక్షలతో ఇతర రాష్ట్రాల నుంచి జీవాలు రాకపోవడం వల్ల భాగ్యనగరంలో ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయాయి. కొనుగోళ్లు పడిపోవడం వల్ల పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వ్యాపారులు, రైతులు వాపోతున్నారు. ఈ సారి జియాగూడ, చెంగిచెర్ల, ఇతర మాంసం మార్కెట్లు బోసిపాయాయి.
అంతా తారుమారైంది
అనంత, అపార కరుణా ప్రధాత అల్లాహ్ పేరిట... ప్రవక్త కాలంలో ఒక వ్యక్తి తన కుటుంబం తరఫున ఒక గొర్రె, మేకను కుర్బానీ ఇచ్చేవారు. గొర్రె, మేక కుర్బానీ ఇచ్చే స్థోమత లేని కుటుంబాలు... ఏడుగురు కలిసి ఒక ఆవును, పది మంది కలిసి ఒక ఒంటెను ఇవ్వవచ్చు. కొమ్ములు గల జంతువు, కాళ్లు, ఉదరం నల్లగా ఉన్న పొట్టేలు, కళ్లు నల్లగా, బలిష్టమైన, ఖరీదైన జంతువులను కుర్బానీ ఇవ్వడం అభిలషణీయం. అందుకనుగుణంగా బక్రీద్‌కు వారం రోజుల ముందే వివిధ రాష్ట్రాల నుంచి జీవాలు పెద్ద ఎత్తున నగరానికి దిగుమతయ్యేవి. కానీ గత మూడేళ్ల కాలంలో ఈసారి పరిస్థితి దయనీయంగా మారిందంటున్నారు వ్యాపారులు.
నిలిచిన రవాణా
ఏటా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జీవాలు హైదరాబాద్‌కు తీసుకొచ్చేవారు. ఎంత వ్యయమైనా వెచ్చించి స్థానిక వ్యాపారులు దందా చేయడం ఆనవాయితీ. కరోనా వైరస్ కట్టడి, లాక్‌డౌన్ ఆంక్షలతో... ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలపై నిషేధం ఉండటం వల్ల జీవాల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా వర్తకులు, రైతులు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. జంట నగరాల్లో ఉన్న వ్యాపారులంతా చిన్న, సన్నకారు వర్తకులే కావడం వల్ల ప్రస్తుతం పలికే ధరలు గిట్టుబాటు కావడం లేదు. కిలో మాంసం రూ. 700 రూపాయలకు కూడా అమ్ముడుపోవడం లేదు. అంతేకాకుండా కుర్బానీ 50 శాతం కూడా మించడం లేదు. 20 కిలోల మేక 17 నుంచి 18 వేల రూపాయల ధర పలుకుతుండటం పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోందని వ్యాపారులు, వినియోగదారులు వాపోతున్నారు.
బోసిపోయిన మార్కెట్లు
పండగల సీజన్ వచ్చిందంటే మాంసానికి గిరాకీ అంతా ఇంతా కాదు. బక్రీద్ కోసం కొంత మంది నెల, రెండు నెలల ముందే గొర్రెలు, మేకలు కొనుక్కుంటారు. ఈ రెండు నెలలు వ్యాపారులకు చేతి నిండా పని దొరుకుతుంది. అలాంటిది ఈసారి గొర్రెలు అమ్ముడవుతాయా? లేదా? అని వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మేకలు, గొర్రెల వ్యాపారులు జియాగూడ మార్కెట్లో విక్రయిస్తుంటారు. చెంగిచెర్ల, జియాగూడ, బోయిగూడ, అంబర్‌పేటలో ప్రభుత్వ గుర్తింపు పొందిన కబేళాలు ఉండగా... చెంగిచెర్ల, జియాగూడ ఒకే సామర్థ్యంతో నడుస్తుంటాయి. రమ్‌నస్‌పుర వంటి కేంద్రాల్లో పెద్ద జంతువులను వధిస్తాయి. తాజా పరిణామాల నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కృష్ణా, గుంటూరు, వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల రైతుల నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చే మధ్యవర్తులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
కోట్లలో వ్యాపారం జరిగేది
ఏటా బక్రీద్ సందర్భంగా స్థానిక మార్కెట్లలో పెద్ద సంఖ్యలో జీవాలు అమ్ముడయ్యేవి. కొన్ని ప్రత్యేకమైన గొర్రెలు దిల్లీ, ముంబయికి కూడా తరలించేవారు. కానీ ఈసారి అలాంటి అవకాశం లేకుండాపోయింది. కరోనాకు ముందు బక్రీద్ వేళ జంట నగరాల్లో రెండు రోజుల్లోనే... కోట్లాది రూపాయల వ్యాపారం సాగుతుంది. జీవాల పెంపకందారులు, వ్యాపారులు, దళారులు, కూలీలకు పెద్ద ఉపాధి వనరు. ఇక వినియోగదారులకు చక్కటి పౌష్టికాహారం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా దేశవ్యాప్తంగా... ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో జీవాల పెంపకంపై ప్రభుత్వాలు దృష్టి సారించినందున ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. కరోనాదెబ్బకు కుదేలైన తమను సర్కారు ఆదుకోవాలని వ్యాపారవర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా కొందరు ఔత్సాహికులు చేస్తున్న విక్రయాలు సత్ఫలితాలిస్తున్నాయని చెప్పొచ్చు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు