గుంటూరు జిల్లా బాపట్లలో కొవిడ్ మృతుడి పట్ల అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. కరోనాతో బాపట్ల ఆసుపత్రిలో మరణించిన వృద్ధుడి మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది రిక్షాలో తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరోనాతో బాపట్ల ఆసుపత్రిలో.. మరణించిన వృద్ధుడి మృతదేహానికి కనీసం కొవిడ్ నిబంధనల ప్రకారం.. ప్యాక్ చేయకుండా పాలిథిన్ కవర్లో చుట్టి తీసుకెళ్లారు. మృతదేహం తీసుకెళ్తున్న సమయంలో ఎవరో ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ విషయం ఉపసభాపతి కోన రఘుపతికి దృష్టికి వెళ్లింది. ఆయన అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వృద్ధుడి స్వస్థలం ప్రకాశం జిల్లా చీరాల అని అధికారులు తెలిపారు. గుండె నొప్పి రావడంతో బాపట్ల ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆయన మరణించిన తర్వాత కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆసుపత్రి అధికారులు, పోలీసుల సమాచారం మేరకు మున్సిపల్ అధికారులు మృతదేహాన్ని.. రిక్షాలో తరలించారు.