జీహెచ్ఎంసీలో కార్మికుల్లో కరోనా కలకలం రేపుతోంది. అంబర్‌పేట సర్కిల్లో ఓ పారిశుద్ధ్య కార్మికులకి కొవిడ్ సోకగ మిగతా కార్మికులు భయపడుతున్నారు. ఆ వ్యక్తితో పాటు పనిచేసిన ఎనిమిది మందిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. ఇటీవల రాష్ట్రంలో నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్‌లోనే ఉండగా అధికార యంత్రాంగం కరోనా కట్టడిపై దృష్టి సారిస్తోంది. పాజిటివ్ వచ్చిన వారికి ఎలా వ్యాధి సోకింది అనే అంశాలను బల్దియా, వైద్యశాఖ అధికారులు తెలుసుకుంటున్నారు.
కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి..
ఖైరతాబాద్, చార్మినార్ జోన్లలో ఎక్కువ కరోనా కేసులు రాగా.. అధికార యంత్రాంగం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ రోడ్లపైకి వస్తున్న ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇక వీరితో పాటు నగరంలోని వలస కూలీలు కూడా అత్యధికంగా వ్యాధి బారిన పడుతున్నారు. నిన్న ఒక్కరోజే 14 మంది వలస కూలీలకు సోకగా బల్దియా అధికారులు అనుమానంగా ఉన్న మిగతా వలస కూలీలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
భాగ్యనగరంలో రోడ్లపైకి యథేచ్ఛగా జనం...
నగరంలో ఎలాంటి సడలింపులు ఇవ్వకపోయినా జనాలు మాత్రం రోడ్లపైకి భారీగా వస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఏ మాత్రం పాటించకుండా కూరగాయలు, పండ్ల దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. మార్కెట్ల వద్ద శానిటైజర్ల, మాస్కులు కూడా వాడట్లేదు. గ్రేటర్ పరిధిలోని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో తనిఖీలు జరిపి లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా తెరిచిన 14 దుకాణాలను సీజ్ చేశారు. అయితే నగరంలోని కొన్ని ప్రైవేటు కార్యాలయాలు, కార్యకలాపాలు నిర్వహిస్తున్నా.. రవాణా సౌకర్యం లేక ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు.
ఇదీ చదవండి: 'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'