రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ పేట్రేగిపోతోంది. మహమ్మారికి ఒక్కరోజులోనే 38 మంది బలయ్యారు. కొత్తగా 8,126 పాజిటివ్‌లు నమోదయ్యాయి. తెలంగాణలో గత ఏడాది మార్చి 2న కొవిడ్ బయటపడగా అప్పటి నుంచి ఇప్పటి వరకూ కేసుల్లో, మృతుల్లో ఇవే అత్యధికం. కేవలం 10 రోజుల వ్యవధిలోనే రెట్టింపు కంటే అధికంగా కొత్త కేసులు వచ్చాయి. ఈనెల 14న 3,307 రాగా, ఆ రోజు 8 మంది కన్నుమూశారు. 24న ఏకంగా రెండింతలు కంటే అధికంగా 8,126 కేసులు నిర్ధారణ అయ్యాయి. మరణాలు దాదాపు ఐదింతలున్నాయి.
పెరిగిపోయిన క్రియాశీల కేసులు
ఈనెల 14న రాష్ట్రంలో క్రియాశీల కేసులు 27,861 ఉండగా.. 24 నాటికి ఆ సంఖ్య 62,929కు పెరిగింది. ఈ ప్రభావం ఆసుపత్రులపైనా పడుతోంది. ఇందులో కనీసం 10 శాతం మందికి ఆక్సిజన్ సేవలు, సుమారు 3 శాతం మందికి వెంటిలేటర్ చికిత్సలు అవసరమవుతాయని అంచనా. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే 10 రోజుల్లో కొత్తగా 8,000 మంది బాధితులకు ఆక్సిజన్ పడకలు అవసరమవుతాయనే ఆందోళన వైద్య శాఖలో వ్యక్తమవుతోంది.
కోలుకునే వారు తగ్గుతున్నారు...
రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,95,232కు, మరణాలు 1,999కు చేరాయి. తాజాగా మరో 3,307 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ చికిత్సానంతరం 3,30,304 మంది ఆరోగ్యవంతులయ్యారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో కోలుకున్నవారి శాతం 83.57గా నమోదైంది. గత నెల మొదటి వారంలో ఇది 98 శాతంగా ఉంది. అంటే ఏకంగా 15 శాతం తగ్గినట్టు. ఈ అంశంలో జాతీయ సగటు కూడా 83 శాతంగానే నమోదైంది.
ఇప్పటిదాకా 40,06,351 డోసులు
శనివారం ఒక్కరోజే 2,00,800 డోసుల వ్యాక్సిన్ వేశారు. ఇందులో మొదటి డోసు 1,75,718, రెండో డోసు 25,082. మొత్తం ఇప్పటిదాకా 40,06,351 డోసులు వేశారు.
జిల్లాల్లో విజృంభణ
రాష్ట్రవ్యాప్తంగా శనివారం 1,08,602 నమూనాలను పరీక్షించారు. మొత్తం పరీక్షల సంఖ్య 1,24,93,399కి చేరింది. 5,429 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. జీహెచ్‌ఎంసీలో గత ఆరు నెలల్లో అత్యధిక కేసులు శుక్ర, శనివారాల్లో నమోదయ్యాయి. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,259 కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ కాగా, అంతకుముందు రోజు కూడా అత్యధికంగా 1,464 కేసులు నమోదయ్యాయి.
కుమురంభీం ఆసిఫాబాద్(90), జోగులాంబ గద్వాల(70), నిర్మల్(68), ములుగు(63), జయశంకర్ భూపాలపల్లి(55), నారాయణపేట(49), నాగర్‌కర్నూల్(47) మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ 100కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 676, రంగారెడ్డిలో 591, నిజామాబాద్‌లో 497, నల్గొండలో 346, ఖమ్మంలో 339, వరంగల్ నగర జిల్లాలో 334, మహబూబ్‌నగర్‌లో 306, సిద్దిపేటలో 306, కరీంనగర్‌లో 286, జగిత్యాలలో 264, మంచిర్యాలలో 233, సంగారెడ్డిలో 201, మెదక్‌లో 192, భద్రాద్రి కొత్తగూడెంలో 187, వికారాబాద్‌లో 185, కామారెడ్డిలో 180, వరంగల్ గ్రామీణలో 175, సూర్యాపేటలో 168, యాదాద్రి భువనగిరిలో 167, రాజన్న సిరిసిల్లలో 164, మహబూబాబాద్‌లో 148, జనగామలో 140, పెద్దపల్లిలో 121, ఆదిలాబాద్‌లో 119, వనపర్తిలో 100 కొత్త కేసుల్ని నిర్ధారించారు.
కొవిడ్ కేర్ సెంటర్లలో 4,807 పడకలు
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 50 కొవిడ్ కేర్ సెంటర్లు అందుబాటులో ఉండగా, వీటిలో 4,807 పడకలను ఏర్పాటు చేశారు. శనివారం నాటికి ఇందులో 781 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలనీ, బయటకు వస్తే మాస్కు ధరించాలనీ, ఏ వస్తువును తాకినా వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు సూచిస్తున్నారు.
ఏపీలో 69 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రెండో దశ సునామీలా విరుచుకుపడుతోంది. కేవలం 12 రోజుల వ్యవధిలో లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నెల 13 నాటికి 9,32,892గా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం నాటికి 10,33,560కు చేరింది. గతేడాది నవంబరు 3 నాటికి 8,30,731గా ఉన్న కరోనా కేసులు 9,32,892కు (లక్షకు పైగా) చేరటానికి 161 రోజుల సమయం పట్టగా.. ఈసారి మాత్రం అతి తక్కువ వ్యవధిలో అత్యంత వేగంగా లక్ష కేసులు నమోదయ్యాయి. కేవలం ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో రాష్ట్రంలో 12,634 కొత్త కేసులొచ్చాయి. కరోనా వైరస్ బారినపడిన వారిలో తాజాగా 69 మంది ప్రాణాలు కోల్పోయారు.