తెలంగాణలో కరోనా వైరస్ తన విజృంభణను కొనసాగిస్తోంది. గత రెండు వారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. జీహెచ్ఎంసీతో పాటు.. ప్రధాన నగరాలైన కరీంనగర్, వరంగల్, నల్గొండలోనూ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతిరోజూ ఆయా జిల్లాల్లో సగటున 50కి పైగా కేసులు వస్తున్నాయి.
జులై తొలివారానికి జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే కరోనా విస్తృతి ఎక్కువగా కనిపించింది. ఇటీవల రంగారెడ్డి జిల్లాలోనూ రోజుకు కేసులు 200 వరకు చేరువయ్యాయి. ఈ నెల 10 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 12,834 కేసులు వచ్చాయి. వీటిలో 55.29 శాతం జీహెచ్‌ఎంసీ కేంద్రంగా ఉన్నాయి. ఆ తరువాత రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్ జిల్లాలున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు 27,441 కేసులు నమోదయ్యాయి. జూన్ 30 నాటికి 16,339 కరోనా కేసులు ఉంటే... శనివారం నాటికి 43,780 కు చేరుకున్నాయి. ఈనెల 3 నాటికి 20,462గా ఉన్న కేసులు 15 రోజుల్లోనే రెండింతల కంటే మించి పెరిగిపోయాయి.
గత కొన్ని రోజులుగా ప్రభుత్వం పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచుతోంది. ఈనెలలోనే 1,64,137 నమూనాలు పరీక్షించగా 27,441 పాజిటివ్ కేసులు వచ్చాయి. పాజిటివ్ రేటు 16.71 శాతంగా నిలిచింది.
ఏజెన్సీ జిల్లాల్లోనూ...
ఏజెన్సీ జిల్లాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో ఇటీవల కేసులు ఎక్కువయ్యాయి. కొన్ని జిల్లాల్లో ప్రతిరోజూ 30- 50 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, వనపర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కేసుల సంఖ్య ఎక్కువైంది. మైదాన ప్రాంతాలే కాకుండా ఏజెన్సీ జిల్లాల్లోనూ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆసిఫాబాద్, నాగర్‌కర్నూలు, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ రూరల్ జిల్లాల్లో తీవ్రత పెరుగుతోంది. ఈనెల 10 నుంచి కేసుల తీరు ఇలా ఉంది.