Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీ, ఆబ్కారీ శాఖల మధ్య వివాదంగా మారింది. డిజిటల్ డేటా కోసం రెండు శాఖల మధ్య వార్ సాగుతోంది. ఎక్సైజ్ శాఖ దర్యాప్తు చేసిన డ్రగ్స్ కేసును.. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ విచారణ జరుపుతోంది. సమాచారం కోసం వివిధ ప్రయత్నాలు చేస్తున్న ఈడీ... చివరకు సీఎస్, ఎక్సైజ్డైరెక్టర్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసే స్థాయికి వెళ్లింది. ఈనెల 23న కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసినట్లు మీడియాలో ప్రచారం కాగానే... మరుసటి రోజు ఎక్సైజ్ అధికారులు పలు రికార్డులను ఈడీకి అప్పగించారు. ఎఫ్ఐఆర్లు, ఛార్జ్షీట్లు, వాంగ్మూలాలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలతో పెన్‌డ్రైవ్ ఇచ్చారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారుల వివరాలు లేవని ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
కాల్ డేటా ఎక్కడ..?: నిందితులతో పాటు... ఎక్సైజ్ అధికారులు ప్రశ్నించిన సినీ తారలు, ఇతరుల కాల్ డేటా వివరాలు తమకు కావాలని ఈడీ కోరుతోంది. నిందితులు, ఇతరులకు సంబంధించిన 2016-18 కాల్‌డేటా రికార్డులు కూడా ఇవ్వాలని దర్యాప్తు అధికారులు ఎక్సైజ్‌ను అడుగుతున్నారు. అయితే.. నిందితులు, సినీ తారలు, సాక్షుల కాల్‌డేటా వివరాలను దర్యాప్తు అధికారులు సేకరించలేదని ఈడీకి ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ రాసిన లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తులో పాలుపంచుకున్న ఎస్టీఎఫ్ అధికారులు కేవలం సమాచారం కోసం 12 మంది కాల్ డేటా తీసుకున్నారంటూ.. వాటిని ఈడీకి అప్పగించారు. ఇదిలా ఉండగా.. తమకు అవసరమైన కాల్‌డేటాను ఎక్సైజ్ అధికారులు ఇవ్వడం లేదని ఈడీ వాదిస్తోంది. కాల్‌డేటా, ఇతర డిజిటల్ సమాచారం సేకరించినట్లు ఛార్జ్షీట్లు, ఎఫ్ఐఆర్లు, వాంగ్మూలాల్లో పేర్కొన్నారన్న ఈడీ.. కొన్ని మొబైల్ నెంబర్లను ప్రస్తావిస్తోంది. కాల్‌డేటా వివరాలు తమ వద్ద రెండేళ్లు మాత్రమే ఉంటాయని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు చెబుతున్నందున.. ఎక్సైజ్ దర్యాప్తు అధికారులే ఇవ్వాలని ఈడీ పట్టుబడుతోంది.
డిజిటల్ డేటా వెలికి తీయలేదు: నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలికి తీసిన డిజిటల్ డేటా తమకు ఇవ్వాలని ఈడీ కోరుతోంది. నిందితుల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఛార్జ్షీట్లు, వాంగ్మూలాల్లో ప్రస్తావించారంటున్న ఈడీ.. వాటికి సంబంధించిన డిజిటల్ డేటా కావాలని అడుగుతోంది. ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి డిజిటల్ డేటా వెలికి తీయలేదని ఎక్సైజ్ అధికారులు ఈడీకి తెలిపారు. కెల్విన్ నుంచి స్వాధీనం చేసుకున్న 11 మొబైల్ ఫోన్లు, 5 సిమ్ములు, సీపీయూ, డెస్క్‌టాప్, రెండు సిమ్ కార్డులు, రెండు పెన్‌డ్రైవ్‌లు, ఫోన్ నెంబర్లతో కూడిన కాగితాలతో పాటు... ఇతర నిందితుల వద్ద లభించిన మత్తు పదార్థాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవ్వాలని ఈడీ కోరుతోంది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఛార్జ్‌షీట్లతో పాటు కోర్టులకు అప్పగించామని.. ఈడీకి ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ తెలిపారు. ఎఫ్ఐఆర్లు, ఛార్జ్ షీట్ల కోసం పలుమార్లు లేఖలు రాసి చివరకు కోర్టుల నుంచే తీసుకున్నామంటున్న ఈడీ... ఎలక్ట్రానిక్ పరికరాలు న్యాయస్థానాల వద్ద లేవని.. మరోసారి కార్యాలయంలో పరిశీలించాలని ఎక్సైజ్‌ను కోరుతోంది. నిందితులు, సినీ తారలను ప్రశ్నించినప్పుడు ఎక్సైజ్ అధికారులు రికార్డు చేసిన వీడియోలన్నీ తమకు ఇవ్వాలన్నది ఈడీ మరో అభ్యర్థన. వీడియో చిత్రీకరించినట్లు వాంగ్మూలాలను బట్టి తెలుస్తోందని.. ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావు గతేడాది ఆగస్టు 30న తెలిపారని ఈడీ పేర్కొంది. విమర్శలు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా 12 మంది విచారణనే రికార్డు చేశామన్న ఎక్సైజ్... వాటిని ఈడీకి అప్పగించింది.
కీలకం కానున్న హైకోర్టు విచారణ: తమ వద్ద ఉన్న సమాచారమంతా ఇచ్చేశామని ఎక్సైజ్ శాఖ చెబుతుండగా... తమకు అవసరమైన రికార్డులు ఇవ్వడం లేదని ఈడీ ఆరోపిస్తోంది. హైకోర్టు ఆదేశాలను ఎక్సైజ్ అమలు చేయడం లేదంటోంది. సమాచారం, డిజిటల్ డేటా కోసం వివిధ ప్రయత్నాలు చేస్తున్న ఈడీ... చివరకు సీఎస్ సోమేష్ కుమార్, అబ్కారీ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్‌పై దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ కోసం ఎదురు చూస్తోంది.
ఇదీ చూడండి: