Telangana Martyrs Monument News: తెలంగాణ అమరవీరుల త్యాగాలను గౌరవించుకునేలా... ఎల్లప్పుడూ స్మరించుకునేలా హైదరాబాద్ నడిబొడ్డున స్మారకం నిర్మాణం అవుతోంది. హుస్సేన్‌సాగర్ తీరాన, సచివాలయం ఎదురుగా లుంబినీపార్కును ఆనుకొని అమరవీరుల స్మారకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. విభిన్నంగా నిర్మితమవుతోన్న స్మారకంలో.. మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆర్ట్ గ్యాలరీతోపాటు జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించేలా... కన్వెన్షన్‌హాల్ కూడా ఉండనుంది. మూడెకరాలకుపైగా విస్తీర్ణంలో 6 అంతస్తుల్లో ఈ నిర్మాణం జరుగుతోంది.
26 వేల 800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్మారకం అందుబాటులోకి రానుంది. భూమి నుంచి 50 మీటర్ల ఎత్తులో నిర్మాణం ఉండనుంది. టెర్రేస్ లెవల్‌పైన 27 మీటర్ల ఎత్తులో దీపం నమూనాను ఏర్పాటు చేయనున్నారు. అమరుల స్ఫూర్తి నిత్యం జలించేలా విభిన్న తరహాలో ఈ దీపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్మారకం ప్రవేశద్వారం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణానికి సంబంధించిన ఉక్కు సహా ఇతర పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. స్మారకానికి చుట్టూ స్టెయిన్‌లెస్ స్టీల్‌తోకూడిన ఫ్రేమింగ్‌తో క్లాడింగ్ పనులు పూర్తి కావాల్సి ఉంది.
దుబాయికి కంపెనీ క్లాడింగ్ పనుచేస్తోంది. ఇందుకు అవసరమైన స్టెయిన్‌లెస్ స్టీల్‌ను జర్మనీతోపాటు... వివిధ ఇతర దేశాల నుంచి సమీకరించుకుంటున్నారు. దుబాయి నుంచి నౌక ద్వారా 20 కంటెయినర్లలో స్టెయిన్‌లెస్ స్టీల్ ప్యానళ్లను తరలిస్తున్నారు. ఇప్పటికే రెండు కంటెయినర్లలో వచ్చిన సామాగ్రి హైదరాబాద్‌కు చేరుకుంది. దీంతో స్మారకానికి దిగువ ప్రాంతంలో స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమింగ్ పనులు మొదలుపెట్టారు. ఎక్కడా కూడా గీతలు, జాయింట్లు కనిపించకుండా క్లాడింగ్ పనులు చేస్తున్నారు. మరో రెండు కంటెయినర్లు ఇంకో వారం రోజుల్లో రానున్నాయి.
జూలై నెలాఖరు వరకు సామాగ్రి అంతా హైదరాబాద్ చేరుకుంటుందని చెప్తున్నారు. అందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేస్తున్నారు. స్టెయిన్ లెస్ స్టీల్ తో స్మారకానికి సంబంధించిన నమూనాను ముందుగా సిద్ధం చేశారు. దుబాయిలోనే ఆ నమూనాను పూర్తిగా సిద్ధం చేసి ఇక్కడకు తీసుకొచ్చారు. అదే తరహాలో అమరవీరుల స్మారకాన్ని తీర్చిదిద్దనున్నారు. వీలైనంత త్వరగా ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
ఇవీ చదవండి:'దసరా తర్వాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారు..'