మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించి నిర్మాణ సామగ్రి కంపెనీలు, సరఫరాదారులు ధరలు పెంచుతున్నారు. సిమెంట్ కంపెనీలు ప్రతినెలా పది రోజుల పాటు ఉత్పత్తి, సరఫరా నిలిపివేస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో ధరలు పెరిగేలా చేస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు సిమెంట్ బస్తా ధర రూ.250 ఉంటే ప్రస్తుతం రూ.380కి చేరింది. సాధారణ కేటగిరీ ఉక్కు టన్ను ధర నెల రోజుల క్రితం రూ.52,500 ఉంటే తాజాగా రూ.56వేలకు చేరింది. బ్రాండెడ్ ఉక్కు ధర రూ.66వేలు దాటింది. ఉక్కు ధరలు నెలాఖరు నాటికి టన్నుపై కనీసం మరో రూ.3వేల వరకు పెరిగే అవకాశముందని హైదరాబాద్‌లోని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. నిర్మాణంలో కీలకమైన కంకర ధరలు పెంచేందుకు సరఫరాదారులు గత వారం రోజులుగా సమ్మె పేరిట కొరత సృష్టించారు. దీంతో మార్కెట్‌లో కంకర ధర టన్ను ఒక్కసారిగా 35శాతం వరకు పెరిగింది. వేసవికాలం కావడంతో ఇసుక లభ్యత ఎక్కువగా ఉండి ధరల్లో వ్యత్యాసం టన్నుకు రూ.100-150 వరకు పరిమితమైంది.
కట్టుబడి వ్యయం పైపైకి..
గత ఏడాది చదరపు అడుగుకు కట్టుబడి వ్యయం రూ.190 నుంచి రూ.220 మధ్య ఉంటే.. ప్రస్తుతం రూ.250-280కి చేరింది. మరోవైపు ఈ ధరలను ఇంకా పెంచాలని ఆయా కార్మిక సంఘాలు అంతర్గతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. డీజిల్ ధరలు పెరగడంతో సామగ్రి రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి. నిర్మాణ సామగ్రి తరలించేందుకు డీసీఎం, లారీ యజమానులు గతంలో కనీస ఛార్జి రూ.800లు వసూలు చేస్తే ప్రస్తుతం రూ.1600 తీసుకుంటున్నారు. నిర్మాణంలో కీలకమైన విద్యుత్తు, ప్లంబింగ్ పైపుల ధరలు రెండింతలయ్యాయి. విద్యుత్తు వైర్ల ధరలు 60 శాతం వరకు పెరిగాయి.
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
ధరలు ఇలాగేఉంటే సామాన్యులసొంతింటి కల కష్టమవుతుంది. ధరలపై ప్రభుత్వం ఆయా సంస్థలతో చర్చించి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. - మారం సతీష్‌కుమార్, మారం ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్సు
గిరాకీ పెద్దగా లేదు...
నిర్మాణ సామగ్రి ధరలు ఎక్కువగా ఉండటంతో వ్యాపారం పెద్దగాలేదు. ధరలు తక్కువగా ఉంటేనే పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇళ్లు కట్టుకుంటారు. వ్యాపారస్థులకు ఆదాయం, లాభాలు ఉంటాయి. - శ్రీకాంత్, నవదుర్గ ట్రేడర్స్, శంషాబాద్
ఇవీ చూడండి: ప్రైవేటు వైద్యకళాశాలల్లోను కొవిడ్ సేవలు!