తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అన్నారు. 2023 ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రెండు రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసి పార్టీ నాయకులతో వరస సమావేశాలు నిర్వహించిన ఆయన... ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. పీసీసీ మార్పు విషయం తన పరిధిలోని కాదన్న ఠాగూర్... అధిష్ఠానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి కార్యకర్తను కలుస్తానన్నారు.
రాష్ట్రంలో మంచి నాయకులు ఉన్నారని, యువతకు పెద్దపీట వేసి... క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని ఠాగూర్ వివరించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో మండలాల వారీగా ఇంఛార్జ్‌లను నియమించి పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. కాంగ్రెస్ నేతల్లో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉన్నప్పటికీ... పార్టీ స్టాండ్‌ను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనన్నారు. 2014, 2018 ఎన్నికల నేపథ్యం వేరన్న ఠాగూర్... గతంలో జరిగిన విషయాలు నెమరువేసుకొని రాబోయే ఎన్నికలకు వెళ్తామన్నారు.
తాము గవర్నర్ అపాయింట్మెంట్ ముందే కోరినా... అక్కడి నంచి స్పందన రాలేదని ఠాగూర్ ఆరోపించారు. అన్ని రాష్ట్రాలకు గవర్నర్లు ఉన్నారని, ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదని ఆరోపించారు. తమిళనాడు-తెలంగాణ రాజకీయాలు వేరు కాదని, రెండూ కూడా ఉద్వేగంతో కూడిన రాష్ట్రాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయాలు రావాలంటే ప్రతిసారి ఒకే వ్యూహం ఉపయోగపడదని, పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మార్చుకోవాలన్నారు. తమిళనాడు-తెలంగాణ ప్రజలు ఒకే ఎమోషనల్ కలిగినవారని, తన నియోజకవర్గంలోనూ... చాలా మంది తెలుగు మాట్లాడే వారు ఉన్నారని తెలిపారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్‌కి మద్దతు ఇచ్చే విషయం కమిటీ నిర్ణయిస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ప్రతి ఒక్కరూ ఓ అభ్యర్థిలా పనిచేసినప్పుడే గెలుపు: మాణిక్కం