రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన 'స్పీకప్ తెలంగాణ' ఆన్‌లైన్ ఉద్యమం ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు, వ్యాపార, వాణిజ్య వర్గాలకు చెందిన వారిని భాగస్వాములు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. స్మార్ట్ ఫోన్ వాడకంపై అవగాహన లేని చిరువ్యాపారులు, కార్మికులు, కర్షకులు, నిరక్షరాస్యులకు పార్టీ శ్రేణులు తోడుగా నిలవాలని ఒక ప్రకటనలో అన్నారు.
సౌకర్యాలు మెరుగుపరచాలి
ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ప్రధాన డిమాండ్లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్ స్పష్టం చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, కరోనా పరీక్షలు సంఖ్యను పెంచాలని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఛార్జీలు నియంత్రించడంతోపాటు 50 శాతం పడకలు ప్రభుత్వ నియంత్రణలో ఉండేలా చూడాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు, ఆక్సిజన్ సౌకర్యాలను మరింత మెరుగు పరచాలని డిమాండ్ చేశారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షలు పరిహారం చెల్లించాలన్నారు. కరోనాపై పోరాడుతూ మరణించిన వైద్య, పారిశుద్ధ్య, పోలీస్ సిబ్బందికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: నాయినా..! నాకు ఊపిరాడటం లేదు...