టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసినా.... అది ఇంకా ఆమోదం పొందలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు తెలిపారు. తెరాస నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని వీహెచ్ సూచించారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీల మ్యానిఫెస్టోను నగర వాసులు నమ్మలేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ సక్రమంగా ప్రచారం చేయలేదని... అభ్యర్ధులకు పార్టీ డబ్బులు కూడా ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు అగ్ర కులాలు పీసీసీగా ఉన్నారని... ఈసారైనా బీసీలకు ఇవ్వాలని ఏఐసీసీని కోరనున్నట్లు వీహెచ్ తెలిపారు.
"బీసీలకు ఇవ్వాలని నేను అడుగుతున్నా... కాదంటే వాళ్ళ ఇష్టం... నేనేమి చేస్తా" అంటూ వీహెచ్ నిట్టూర్చారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ బద్ద శత్రువులా చూశారని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎంలో మార్పు రావాలని ఆకాంక్షించారు. భాజపాను నమ్మి దగ్గర పెట్టుకుంటే... ఇప్పుడేమైందని వీహెచ్ ప్రశ్నించారు.