హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించిన వ్యూహాలు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అంశాల గురించి మంతనాలు చేశారు. అందుబాటులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైతు సంక్షేమం కోసం పనిచేసేది కేవలం తమ పార్టీ మాత్రమేనని కాంగ్రెస్ నేతలు అన్నారు. అధికారంలో ఉంటే.. రైతుల సంక్షేమం కోసం పాటు పడతామని... విపక్షంలో ఉన్నా వారి సంక్షేమం కోసమే పోరాడుతామని తెలిపారు.
తెరాస ప్రభుత్వానికి పంటరుణాల మాఫీపై స్పష్టత లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు 6వేల మంది రైతులు మరణించినా.. ప్రభుత్వం నోరు మెదపలేదని అగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఆ పార్టీ సీనియర్ నేత కోదండరెడ్డితో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
రెవెన్యూ చట్టాన్ని వచ్చే శాసనసభలో ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని చెప్పారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికి రైతుబంధు పథకం వర్తింపచేయాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మరణించిన రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం వెంటనే అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు, కేసీఆర్ ఒక్కరోజు చెరువు దగ్గర కుర్చీ వేసుకొని కూర్చున్నంత మాత్రాన సాగునీటి సమస్య తీరదని ఎద్దేవా చేశారు.