Congress Protest: రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులు పోరుబాటపట్టాయి. ధరల పెంపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై మండిపడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రదర్శించాయి. హైదరాబాద్ అంబర్‌పేట్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హన్మంతురావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గ్యాస్ బండలతో శవయాత్ర నిర్వహించి.... నిరసన వ్యక్తం చేశారు. భాజపా, తెరాస పాలనతో ప్రజలకు వెనకటి రోజులొస్తున్నాయని వీహెచ్ విమర్శించారు.
"కేంద్ర ప్రభుత్వమేమో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచితే.. ఇటు రాష్ట్ర సర్కారు విద్యుత్ ఛార్జీలు పెంచింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. దాని ప్రభావం నిత్యావసర ధరలన్నింటిపై పడుతుంది. ఈ పరిణామాలన్ని చూస్తే.. మళ్లీ వెనకటి రోజులు వస్తాయనిపిస్తోంది. రెండు ప్రభుత్వాలు కలిసి.. సామాన్యుల నడ్డి విరుస్తున్నారు." - వి.హన్మంతరావు, కాంగ్రెస్ సీనియర్ నేత
ఎల్బీనగర్‌లో..: ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రాంరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. గ్యాస్ బండకు పూలమాలవేసి.... కార్యకర్తలు గుండు గీయించుకుని ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. ఓ వైపు రైతుల బతుకులు రోడ్డున పడేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.... ధరలు పెంచి సామాన్య జనం నడ్డీ విరుస్తున్నాయని రాంరెడ్డి విమర్శించారు.
హన్మకొండలో..: ధరల పెంపును నిరసిస్తూ.... హన్మకొండలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. పార్టీ నేత నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి.... ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా గ్యాస్ బండలకు పూలదండలు వేసి... నిరసన వ్యక్తం చేశారు. వర్ధన్నపేటలో వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై కార్యకర్తలు గ్యాస్ సిలిండర్లతో బైఠాయించారు. సిరిసిల్ల గాంధీచౌక్‌లో గ్యాస్ సిలిండర్లతో కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టారు.
కరీంనగర్‌లో..: కరీంనగర్‌లో నిర్వహించిన ప్రదర్శనలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సిలిండర్లకు పూలమాలలు వేసి... నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో సామాన్యులకు అందుబాటులో ఉన్న ధరలు.. భాజపా, తెరాస పాలనలో ఆకాశన్నంటి పేదల నడ్డి విరుస్తున్నాయని పొన్నం విమర్శించారు.
"అటు ప్రధాని నరేంద్రమోదీ, ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇద్దరు తోడు దొంగల్లా దేశాన్ని, రాష్ట్రాన్ని ఇష్టమున్నట్టు దోచుకుంటున్నారు. నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. రైతుల ఇబ్బందులు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమున్నప్పుడు మూడు వందల చిల్లరున్న గ్యాస్ ఇప్పుడు ఏకంగా వెయ్యి రూపాయలకు చేరిన పరిస్థితుల్లో మహిళలంతా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. పెంచిన ధరలు తగ్గించే దాకా.. ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేలా ఉద్యమాలు చేయాలని కోరుకుంటున్నాం." -పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో..: పెంచిన ధరలను నిరసిస్తూ ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా వెంగ్వాపేట్‌లో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్యాస్ సిలిండర్లతో నిరసన ర్యాలీ నిర్వహించి.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పెట్రోల్ బంకుకు పూల దండలు వేసి... నిరసన తెలిపారు.
ఇదీ చూడండి: