హుజూర్‌నగర్ ఉపఎన్నికపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి చివరికి నిరాశే ఎదురైంది. నైరాశ్యంలో ఉన్న శ్రేణులను ఉత్తేజపరచాలని భావించింది. తామే ప్రధాన ప్రతిపక్షమని చెబుతున్న భాజపాకు గట్టి సమాధానం ఇవ్వాలని చూసింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగానూ.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకొని విజయ సారథి కావాలనుకున్న ఉత్తమ్ వ్యూహాలు ఫలించలేదు.
సీటు ఎంపికలోనే కొరవడిన అనైక్యత...
కాంగ్రెస్ పార్టీకి హుజూర్‌నగర్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపిక పరిణామాలే తొలినుంచి నాటకీయంగా మారాయి. సిట్టింగ్ స్థానంలో పద్మావతికి టికెట్ తెప్పించుకోవడంలో ఉత్తమ్ సఫలమయ్యారు. కానీ, రేవంత్‌రెడ్డి తదితరులు బహిరంగంగానే వ్యతిరేకించారు. ఆమెకు టికెట్ ఎలా ఇస్తారని గళమెత్తారు. రేవంత్ తీరును నల్గొండ కాంగ్రెస్ సీనియర్ నేతలు తప్పుపట్టారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌తోపాటు జానారెడ్డి ఉత్తమ్‌కు అండగా నిలిచారు. అధిష్ఠానం సైతం రేవంత్‌తోపాటు అంతా పద్మావతి అభ్యర్థిత్వాన్ని సమర్థించాల్సిందేనని స్పష్టం చేసింది. ఎంతచేసినా చివరకు పద్మావతికి ఓటమి తప్పలేదు.
రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను పట్టుకోవడంలో విఫలం..
రాష్ట్రంలో ఇటీవల నెలకొన్న పరిణామాలు తమకు కలిసివస్తాయని కాంగ్రెస్ భావించింది. ఆర్టీసీ సమ్మె, డెంగీ, విషజ్వరాలు, యూరియా కష్టాలు వంటి అంశాలు ప్రచారాస్త్రాలుగా వాడింది. తెరాసకు మద్దతు ప్రకటించిన సీపీఐ ఆర్టీసీ పరిణామాలతో విరమించుకోవడం కూడా తమ విజయానికి దోహదం చేస్తుందని హస్తం భావించింది. కానీ.. ఊహాగానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ చివరికి తెరాస విజయకేతనం ఎగురవేసింది.
అనుచరగణం ఎక్కడ?
వరస విజయాలు సాధించిన ఉత్తమ్‌కు ఈ ఉపఎన్నిక కోసం ఇంత కష్టపడాల్సి వస్తుందని ఎవరూ ఊహించరు. కానీ పార్టీలో అనైక్యత, గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయి. అభివృద్ధి పనులు చేయడమొక్కటే కాదు... అనుచరగణాన్ని సైతం పట్టించుకోవాలన్నది రాజకీయ సిద్ధాంతం. కానీ పీసీసీ అధ్యక్షుడు కావడంవల్లో లేక, సమయం కుదరకో.. ఉత్తమ్ అనుచరగణాన్ని విస్మరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఓటమి స్వయంకృతాపరాధమేనని పార్టీలో ముచ్చటించుకుంటున్నారు.
ఇవీ చూడండి:కారుజోరు: హుజూర్‌నగర్ తోటలో గులాబీ వికాసం