నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక తర్వాతనే పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గెలుపునకు అవకాశం ఉన్న సీటు కాబట్టి.. ఆ ఉపఎన్నిక తర్వాత పీసీసీ నియామకం చేయ్యాలని మాజీ మంత్రి జానారెడ్డి ఇటీవల అధిష్ఠానానికి లేఖ రాశారు. బుధవారం రాత్రి కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడి ప్రకటనపై తర్జనభర్జనలు పడుతున్న అధిష్ఠానం.. సీనియర్ నేతలతో మరోసారి చర్చలు జరిపారు. ప్రముఖంగా జానారెడ్డి విజ్ఞప్తిపైనే చర్చ సాగినట్లు తెలుస్తోంది.
పీసీసీ అధ్యక్షుడిని ఇప్పుడు ప్రకటించాలా? లేక ఉపఎన్నిక తరువాత ప్రకటించాలా? అన్న అంశంపైనే చర్చ జరిగినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఉపఎన్నిక తర్వాతే పీసీసీ ప్రకటించాలని పలువురు సీనియర్లు స్పష్టం చేశారు. అదే విధంగా సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలపై కూడా చర్చించినట్లు నేతలు తెలిపారు. సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ఫిబ్రవరిలో సింగరేణి అధికారులకు పీఆర్‌పీ చెల్లింపు