అధిక విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. లాక్‌డౌన్ సమయంలో బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ పనిచేసినా... విద్యుత్ అధికారులు ఇంటింటికి వెళ్లి బిల్లులు ఎందుకు ఇవ్వలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సబ్‌స్టేషన్ ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. కరీంనగర్ విద్యుత్ కార్యాలయం ముందు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ధర్నా చేపట్టారు. కరోనా ఉన్నంత కాలం పేదల ఇళ్లకు విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ఏఈకి వినతిపత్రం అందించారు. సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తదితర చోట్ల ధర్నాలు, ర్యాలీలతో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి.
వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లోనూ కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగారు. హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు నల్ల జెండాలతో ధర్నా నిర్వహించారు. ఆందోళనతో అప్రమత్తమైన పోలీసులు... కాంగ్రెస్ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. నల్గొండ విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సూర్యాపేట, హుజూర్‌నగర్‌లో ధర్నాలకు దిగారు. ఖమ్మంతోపాటు వైరా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మహబూబ్‌నగర్ విద్యుత్ భవన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. చిన్న, మధ్య తరహా, కుటీర పరిశ్రమల్ని ఆదుకోవాలని నేతలు గళమెత్తారు. దేవరకద్రలో విద్యుత్ ఉపకేంద్రం ఎదుట ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ నేతలు... 167వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. గద్వాలలో విద్యుత్ బిల్లులు తగ్గించాలంటూ ఎస్ఈ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. నిజామాబాద్ విద్యుత్ భవనం ఎదుట కాంగ్రెస్ నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో విద్యుత్ ఉపకేంద్రం వద్ద ధర్నా చేశారు. ఆదిలాబాద్‌లో ట్రాన్స్‌కో ఎస్ఈకి వినతిపత్రం అందించారు. ఆసిఫాబాద్‌లో నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు విద్యుత్ బిల్లులు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్