ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మధ్య, చిన్న తరహా నీటి పథకాలను అభివృద్ధి చేయాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి డిమాండ్ చేశారు. నీళ్ల సమస్యపై పాదయాత్రకు ప్రయత్నం చేస్తే అరెస్టులు చేయడం బాధాకరమన్నారు. తమ ప్రాంతంల్లో ఎకరానికి లక్షలు ఖర్చు చేసి నీళ్లు ఇస్తున్నారని.. తాము కూడా తెలంగాణలో ఉన్నామని.. సాగునీరివ్వాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమను రత్నాల సీమ చేస్తానంటున్నారని.. కానీ రంగారెడ్డి జిల్లాను మరిచిపోతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఎన్ని ఉద్యమాలు చేసినా అనుమతులిచ్చామని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రజా సమస్యలపై పాదయాత్రకు ప్రయత్నం చేస్తే అనుమతులివ్వకుండా అరెస్టులు చేయడాన్ని ఖండించారు. ఎన్నికల ముందు చంద్రబాబు తమతో కలిస్తే విమర్శించారని.. ప్రస్తుతం జగన్‌కు నీళ్లిస్తామంటున్నారని.. ఇదే ద్వంద్వ వైఖరని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేకమని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి పాదయాత్ర చేయాలని అనుమతి కోరితే అరెస్టు చేయడం దారుణమన్నారు. వెంటనే వారందరినీ విడుదల చేయాలని వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: రైతుల పొలాలు పచ్చగా.. కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రగా..