రెండు దశాబ్దాల తెరాస ప్రస్థానం అంతా కూడా మోసాలు, దగాలు, కుట్రలతో నడిచిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. తెరాస ప్లీనరీ సాక్షిగా సీఎం కేసీఆర్ అన్ని అబద్ధాలు వల్లెవేశారని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ నిధులు, కుటుంబ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన పొన్నాల.. ఒక్క చుక్క సాగునీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. మోదీ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇచ్చిన కేసీఆర్ ఇపుడు కేంద్రాన్ని తూలనాడటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెరాసపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంక్షను కేసీఆర్ ఒక వ్యాపార వస్తువులా వాడుకుని ప్రజలను మోసం చేసి.. దేశంలోనే అతి పెద్ద అవినీతి రాజకీయ ఆస్తిపరుడయ్యారని ధ్వజమెత్తారు. వెయ్యి కోట్ల రూపాయిల పార్టీ ఆస్తులు, లక్ష కోట్లు కేసీఆర్ ఆస్తులున్నాయని .. అదంతా కూడా తెలంగాణాను పీడించి వెనుకేసుకున్నసొమ్మని ఆరోపించారు.
"తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని, శ్రమించిన వారిని కేసీఆర్ నిలువునా ముంచేశారు. రెండు దశాబ్దాల తెరాస చరిత్ర అంతా కూడా దగాకోరుదే. తెలంగాణ ఏర్పాటులో అతి కీలకమైన అమరవీరులను కూడా సీఎం కేసీఆర్ మోసం చేశారు. ఆయా కుటుంబాలకు పది లక్షలు పరిహారం, ఇల్లు, ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ కేవలం 480 మందికి చెందిన కుటుంబాలను మాత్రమే తూతూ మంత్రంగా ఆదుకున్నారు. అవినీతి, అక్రమాలు, అప్పులు, ఆత్మహత్యలు, అరాచకాలు, అణచివేతలకు చిరునామాగా తెలంగాణ రాష్ట్రాన్నిమార్చారు. మాట్లాడితే కేసులు, అరెస్టులు చేస్తూ.. రాజ్యాంగాన్ని అతిక్రమించి పోలీసులు వ్యవహరిస్తూ.. పోలీసు రాజ్యంగా మార్చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్య, రిజర్వేషన్లు అడ్రస్సు లేకుండా పోయాయి. ఇక తెలంగాణ.. ఎందులో దేశానికి ఆదర్శమో చెప్పలేదు."
- కాంగ్రెస్ నాయకులు
ఇదీ చూడండి: