ప్రజా తీర్పు తనకు అనుకూలంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పులు మీద తప్పులు చేస్తున్నందున... శిశుపాలుడి తప్పుల్లా రోజురోజుకు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. ప్రజల తిరష్కారానికి గురయ్యే రోజులు దగ్గర పడ్డాయని ఆరోపించారు. ప్రతి విషయంలోనూ ఉచిత సలహాలు ఇస్తూ మాయమాటలు చెప్పి... తనకు తానే మేధావినని చెప్పుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అది నిరంకుశత్వానికి పరాకాష్ట
కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తే.... సీఎం దానిని అవహేళన చేశారని విజయశాంతి తెలిపారు. కరోనా కట్టడికి తగిన వైద్య సౌకర్యాలు లేవని పత్రికల్లో రాస్తే.. వాటి యాజమాన్యానికి శాపనార్థాలు పెట్టారని ధ్వజమెత్తారు. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని హైకోర్టు తప్పు పట్టినా ఏమాత్రం పట్టించుకోలేదని, చేయి దాటి పోతుందని గ్రహించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా జోక్యం చేసుకున్నారన్నారు. సంక్షోభ నివారణకు గవర్నర్ చొరవ తీసుకుంటే... దానిని కూడా సీఎం అడ్డుకోవడాన్ని నిరంకుశత్వానికి పరాకాష్టని ఆమె అభివర్ణించారు.
అనవసర రాద్ధాంతం వద్దు
సీఎంగా కేసీఆర్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనందున గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేయడం కంటే, సీఎం కేసీఆర్ ప్రజలకు భరోసా ఇచ్చేట్లు చర్యలు తీసుకోవడం అవసరమని సూచించారు. లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఆగ్రహానికి సీఎం గురికాకతప్పదని విజయశాంతి హెచ్చరించారు.
ఇదీ చదవండి : ఓఆర్ఆర్పై మంత్రి వాహనం బోల్తా.. ఒకరు దుర్మరణం