కాంగ్రెస్ నేత, ప్రముఖ నటి విజయశాంతి.. నేడు ఉదయం 11 గంటలకు భాజపాలో చేరనున్నారు. ఈ మేరకు దిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో విజయశాంతి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో విజయశాంతి ఇవాళ భాజపా తీర్థం పుచ్చుకోనున్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా భాజపా చేస్తున్న పోరాటాన్ని గుర్తించి విజయశాంతి పార్టీలో చేరుతున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఉద్యమకారులను కేసీఆర్ విస్మరించారని విమర్శించారు. కేవలం ఆయన కుటుంబ చరిత్రను మాత్రమే రాబోయే తరాలకు అందించాలనుకుంటున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఫలితాల పట్ల రాష్ట్ర భాజపా నేతలను అమిత్ షా అభినందించారని అన్నారు. దూకుడును కొనసాగించాలని.. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఇదే ప్రతిభను కనబర్చాలని అమిత్ షా సూచించారని బండి సంజయ్ వెల్లడించారు.
ఇవాళ మీడియా సమావేశంలో అన్ని విషయాలు చెబుతానని విజయశాంతి పేర్కొన్నారు. తన రాజకీయ జీవితం భాజపాతోనే మొదలయిందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి : భారత్ బంద్‌లో మా శ్రేణులు పాల్గొంటారు: కేసీఆర్