కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నందున రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మాజీ మంత్రి షబీర్ అలీ డిమాండ్ చేశారు. కరోనా వచ్చి శ్వాస సమస్య ఉత్పన్నమైతే కనీసం ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు తెలిసిన వాళ్ల కోసం బెడ్స్ కావాలని స్వయంగా తానే పలు ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదించినా ప్రయోజనం లేదని ఆరోపించారు. చివరకు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను సంప్రదించినట్లు పేర్కొన్నారు.
స్వయాన మంత్రి చెప్పినా ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. కరోనా రోగుల లెక్కలు, మరణాల సంఖ్యపై ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని విమర్శించారు. పిట్టలు రాలినట్లు రాలుతున్నా... ప్రజల జీవితాలతో ప్రభుత్వం అటలాడుకుంటోందని ధ్వజమెత్తారు. కరోనా తీవ్రత ఇంత ఎక్కువగా ఉంటే కార్పొరేషన్ ఎన్నికలకు ఇప్పుడు తొందర ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.