కొవిడ్ లక్షణాలతో కన్నుమూసిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు అంత్యక్రియలు... హైదరాబాద్ మహాప్రస్థానంలో ముగిశాయి. ఈ తెల్లవారుజామున నిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన ఎమ్మెస్సార్ అంత్యక్రియలను... రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అంతకుముందు సత్యనారాయణరావు మృతి పట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు.
ఎమ్మెస్సార్ మరణం పార్టీకి తీరని లోటని నేతలు పేర్కొన్నారు. ఎమ్మెస్సార్ కుటుంబసభ్యులకు... పార్టీ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్‌తో పాటు ఏఐసీసీ ఇంఛార్జి మాణికం ఠాగూర్... ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెస్సార్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, సభాపతి పోచారం సంతాపం తెలిపారు. తెలంగాణవాదిగా, ఎంపీగా... ఎమ్మెస్సార్ ప్రత్యేక శైలి కనబరిచారని సీఎం కొనియాడారు. రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరొందారన్న కేసీఆర్.. సత్యనారాయణ రావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.