ఇంటర్మీడియేట్ ఆర్ట్స్ గ్రూపుల్లో సిలబస్ తొలగింపు గందరగోళంగా మారింది. హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనమిక్స్ తదితర సబ్జెక్టుల్లో కొన్ని పాఠాల తొలగింపుపై వివాదం నెలకొంది. స్వాతంత్య్ర సమర యోధులు, సంఘ సంస్కర్తలకు సంబంధించిన పాఠాలు తొలగించడంపై విమర్శలు తలెత్తాయి. దీనిపై ఇంటర్మీడియేట్ బోర్డు వెనక్కి తగ్గింది. పాఠాల తొలగింపు ప్రతిపాదనలు మాత్రమేనని.. ఇంకా పరిశీలనలోనే ఉన్నాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వివరణ ఇచ్చారు.
జాతీయ నేతలు, సంఘ సంస్కర్తలు, ప్రముఖుల పాఠాలు తొలగించే ప్రసక్తే లేదని జలీల్ స్పష్టం చేశారు. కరోనా పరిస్థితుల వల్ల నాలుగు నెలలు వృథా అయినందున.. 30 శాతం సిలబస్ కుదింపునకు ప్రభుత్వం అంగీకరించిందని పేర్కొన్నారు. హ్యుమానిటీస్ గ్రూపుల్లో పాఠాల తొలగింపుపై నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
నిపుణుల కమిటీ సిఫార్సులపై చర్చించాక ఆమోదిస్తామన్నారు. సైన్స్ గ్రూపులకు సంబంధించిన పాఠాలు సీబీఎస్ఈ సూచనల ప్రకారమే తొలగించినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు.
ఇదీ చదవండి : ఇంటర్ సిలబస్‌లో 30 శాతం తొలగింపు