రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సాయంపై హైదరాబాద్ గల్లీలో లొల్లి లొల్లి అవుతోంది. తమకు పరిహారం అందడం లేదంటూ చాలా చోట్ల బాధితులు ఆందోళనలు చేస్తున్నారు. తెరాస అనుచరులకే సాయం చేస్తున్నారని, అసలైన బాధితులను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కార్యాలయాలు ముట్టడించి అర్హులకు సాయం అందించాలని డిమాండ్ చేశారు. రహదార్లపై బైఠాయించి నిరసన తెలియజేశారు.
పెల్లుబికిన ప్రజాగ్రహం
నగరంలో వరదబాధితులకు అందిస్తున్న ఆర్థికసాయం అందడంలేదని పలు కాలనీలవాసులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. ముంపు బాధితులకు డబ్బులు ఇవ్వడంలేదంటూ ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బాధితులను పోలీసులు అడ్డుకున్నారు. వరదసాయం 10వేల రూపాయలు ఇవ్వాలని బాలానగర్-మెదక్ ప్రధాన రహదారిపై రాజీవ్‌గాంధీ నగర్ వాసులు బైఠాయించడం వల్ల భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఆర్థిక సాయం అందలేదని గాజులరామారం ప్రధాన రహదారిపై మహిళలు బైఠాయించటంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
అధికార పార్టీ వారికేనా?
అధికార పార్టీకి చెందిన వారికే వరద సాయం అందిస్తున్నారని సీతాఫల్‌మండిలోని ఉపసభాపతి పద్మారావు కార్యాలయం ఎదుట వరద బాధితులు నిరసన వ్యక్తం చేశారు. వరదల ద్వారా నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అడ్డగుట్ట కార్పొరేటర్ ఇంటిని స్థానికులు ముట్టడించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని శ్రీరామ్ నగర్‌లో వరద సహాయం అందలేదని కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించారు. నాయకులు, అధికారులు కలిసి వరద సహాయంలో కమిషన్లు తీసుకుంటున్నారని బంజారాహిల్స్ డివిజన్ ఉదయనగర్ బస్తీ వాసులు అందోళన చేపట్టారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి
ప్రభుత్వం పంపిణీ చేసిన వరద సహాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని భాజపా యువ మోర్చా డిమాండ్ చేసింది. వరద సాయం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని వామపక్షాల నేతలు సూచించారు. సాయం అందించడంలోనూ వివక్ష చూపుతున్నారని బాధితులు మండిపడ్డారు.
ఇవీచూడండి: సాయం కోసం ముంపు ప్రాంత బాధితుల ఆందోళన