రాష్ట్రంలో పోలీస్‌శాఖకు చెందిన భూములు, ఆస్తులను గుర్తించి వాటి వివరాలను డాక్యుమెంటేషన్ చేయడంతోపాటు డిజిటలైజ్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వశాఖగా ప్రత్యేక గుర్తింపు సాధించిందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రక్రియను రికార్డ్ సమయంలో పూర్తి చేశామని మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ప్రక్రియ పూర్తి చేయడానికి తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందించిందని ఆయన తెలిపారు.
పోలీస్ శాఖ భూ వివరాల డాక్యుమెంట్ విడుదల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ ఎస్టేట్ అధికారులకు ఒకరోజు వర్క్‌షాప్‌ను డీజీపీ కార్యాలయంలో నిర్వహించారు. తెలంగాణలో పోలీస్ శాఖకు చెందిన 940 ఆస్తులను గుర్తించి వాటిలో 7,050 ఎకరాల 24 గుంటల భూములున్నట్లు నిర్ధరించామని డీజీపీ తెలిపారు. అతి తక్కువ సమయంలో ఆస్తుల డాక్యుమెంటేషన్ పూర్తి చేసి ఆదర్శంగా నిల్చిన యూనిట్ కార్యాలయాల ఎస్టేట్ అధికారులకు ప్రత్యేక పురస్కారాలను అందించాలని నిర్ణయించారు.
పోలీస్ అధికారులు పట్టుదలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని... ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో ప్రజల భాగస్వామ్యంతో ఆరు లక్షలకు పైగా సీసీ టీవీలను ఏర్పాటు చేశామని డీజీపీ వివరించారు. ఆస్తుల నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన ఎస్టేట్ అధికారులకు డీజీపీ ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు.
ఇదీ చదవండి: ఆ పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం కొనితెచ్చుకోవద్దు: బండి సంజయ్