కింగ్ కోఠిలోని హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు అందింది. రెండు రోజుల క్రితం ఆ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు కొవిడ్ బాధితులు మృతిచెందారు.
ఈ ఘటనపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్గౌడ్ హెచ్ఆర్సీకి ఫిర్యాదుచేశారు. ఆరోగ్య శాఖను చూస్తున్న సీఎం కేసీఆర్, వైద్యారోగ్య ముఖ్యకార్యదర్శి, డీఎంహెచ్వో, ఆస్పత్రి సూపరింటెండెంట్, కొవిడ్ నోడల్ అధికారిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు.
రాష్ట్రంలో ఆరోగ్యశాఖకు పూర్తిస్థాయిలో మంత్రి లేకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికైనా కొవిడ్ పరిస్థితిపై ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని.. కొవిడ్ పరీక్ష కేంద్రాలు పెంచాలని.. పడకలు, ఆక్సిజన్ కొరత తీర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటన జరిగి రెండు రోజులు గడిచినా ఇంత వరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని కోరారు.
ఇవీచూడండి: కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక అయిదుగురు మృతి!